Latest Updates

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి..

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి.. భారీగా పెరిగిన ధరలు, కిలో ఎంతంటే?

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో వాటిని కొనడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంట నూనెల ధరలు పెరిగాయి. ఇప్పుడు ఉల్లి ధర కూడా పెరగడంతో సామాన్యులకు ఆర్థికంగా భారమైందిగా ఉంది. ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ప్రజలు కోయకుండానే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పెరిగిన ఉల్లి ధరలతో వినియోగదారులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఉల్లి ధరలు  సాహిగా పెరుగుతుండటంతో సామాన్యులు కష్టాలు పడుతున్నారు. వివిధ నగరాల్లో ఇటీవల ఉల్లి ధరలు ఎక్కువయ్యాయి. కొన్ని రోజుల క్రితం వరకు హోల్‌సేల్ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.60 ఉండేది. ఇప్పుడు అది రూ.70 నుంచి రూ.80కి పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లలోనే ఉల్లి ధర ఇంత ఎక్కువగా ఉంటే, రిటైల్ మార్కెట్‌లో సామాన్యులకు అందేసరికి అది రూ.100 వరకు పెరిగే అవకాశం ఉందని కొందరు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వంటల్లో ప్రతి రోజూ అవసరమైన ఉల్లిని కొనాలన్నా, కోయాలన్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఢిల్లీ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో ఉల్లిని కొనడానికి చాలా మంది వినియోగదారులు ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. మేము మండిలో నుంచే ఉల్లిని కొనుగోలు చేస్తామని, ఆ ధరకు మాత్రమే విక్రయిస్తామని వారు చెబుతున్నారు. నవంబర్ 8వ తేదీన ఢిల్లీలో ఉల్లి ధర రూ.80 ఉన్నట్లు సమాచారం.
ఇక దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కూడా ఇలాగే ఉన్నాయి. ఉల్లి పంట అత్యధికంగా వచ్చే మహారాష్ట్రలో రాజధాని ముంబై సహా అన్ని ప్రాంతాల్లో ఉల్లి ఘాటు కొనసాగుతోందని చెబుతున్నారు. 5 కిలోల ఉల్లిని రూ.360 పెట్టి కొనుగోలు చేసినట్లు ముంబై మార్కెట్‌లోని ఓ వినియోగదారుడు పేర్కొ్న్నాడు. ఉల్లి, వెల్లుల్లి ధరలు అమాంతం పెరిగి.. రెట్టింపు ధరకు చేరుకున్నట్లు చెప్పాడు.

గత కొన్ని రోజుల క్రితం కురిసిన అకాల వర్షాల ప్రభావం ఉల్లిపంటపై బాగా పడింది. భారీ వర్షాలతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతినడంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. ఫలితంగా మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా ఉల్లి ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ఇక దేశంలోనే ఉల్లి సాగు ఎక్కువగా చేసే మహారాష్ట్రలో అక్టోబర్‌లో భారీ వర్షాలు కురవడంతో ఉల్లిసాగు కొంత ఆలస్యం అయింది. పంట సాగు ఆలస్యం కావడంతో మార్కెట్లలోకి రావడానికి సమయం పడుతోంది. అదే సమయంలో ఉల్లి నిల్వలు తగ్గిపోవడం, వినియోగం పెరగడంతో ఉల్లిధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే త్వరలోనే కిలో ఉల్లి ధర సెంచరీ కొట్టొచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అయితే ఉల్లి పంట మార్కెట్‌లోకి వచ్చే సరికి జనవరి వస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే జనవరి వరకు ఉల్లి ధరల మంట తప్పదని చెబుతున్నాయి. గతంలో ద్రవ్యోల్బణం, పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మార్కెట్‌లో కృత్రిమ కొరత కారణంగా కూడా ఉల్లి ధరలు పెరగడానికి కారణం అని మరికొందరు ఆరోపిస్తున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు ఉల్లిని కొని నిల్వ చేస్తుండటంతో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు భారీగా పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టి రాయితీ ధరకు ఉల్లిని సరఫరా చేయాలని జనం కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version