Latest Updates
డిల్లీలో మరింత పాడయిన గాలి నాణ్యత.. అమల్లోకి స్టేజ్-2 ప్రణాళిక.

డిల్లీలో మరింత పాడయిన గాలి నాణ్యత.. అమల్లోకి స్టేజ్-2 ప్రణాళిక.
శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీ ప్రజలను వాయు కాలుష్యం వణికిస్తుంది. వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు దగ్గు, శ్వాసకు సంబంధించిన సమస్యలతో జీవిస్తున్నారని తెలుస్తోంది. గాలి వేగం నెమ్మదించడం.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలుబెట్టడంతో వాతావరణంలో కాలుష్యం అమాంతం పెరిగిపోతుంది. నవంబరు నుంచి జనవరి వరకూ ఢిల్లీ వాసులకు ఓ నరకం. ఇళ్ల నుంచి బయటకు రాకూడా పరిస్థితులు ఉంటున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో శీతకాలం రాకముందే వాయు కాలుష్యం భయపెడుతోంది. గత నాలుగైదు రోజులుగా గాలి నాణ్యత చాలా చెడ్డగా క్షీణిస్తోంది. మంగళవారం ఉదయం ఇది మరింత చెడ్డగా పడింది, అందుకే రెండో దశ ప్లాన్ అమలు చేస్తున్నారు. వాయు నాణ్యత–వాతావరణ అంచనా పరిశోధన (SAFAR) డేటా ప్రకారం, ఉదయం 8 గంటలకు వాయు నాణ్యత 317గా ఉంది. ఇది చాలా తీవ్రమైన కేటగిరీగా పరిగణిస్తారు.
వాయు నాణ్యత 0-50 మధ్యలో ఉంటే, అది సంతృప్తికరంగా ఉంటుంది. 51-100 మధ్యలో ఉంటే, అది స్వచ్ఛంగా ఉంటుంది. 101-200 మధ్యలో ఉంటే, అది మోస్తరుగా ఉంటుంది. 201-300 మధ్యలో ఉంటే, అది ప్రమాదకరంగా ఉంటుంది. 400-450 మధ్య నమోదయితే అత్యంత ప్రమాదకరం.. 450 మించితే అత్యంత తీవ్రమైన పరిస్థితిగా పరిగణిస్తారు.
ఢిల్లీలో రాబోయే రోజుల్లో గాలి నాణ్యత దారుణంగా ఉండే అంచనా ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇందుకు కారణమని పేర్కొంది. మంగళవారం నుంచి రెండో దశ ప్లాన్ అమల్లోకి వస్తోంది, అందువల్ల ఢిల్లీ క్యాపిటల్ ప్రాంతంలో బొగ్గు, వంట కలప, డీజిల్ జనరేటర్ల వినియోగంపై ఆంక్షలు విధిస్తారు. గుర్తించిన కొన్ని రహదారులపై రోజూ స్వీపింగ్, నీటిని చిలకరిస్తారు. అలాగే, నిర్మాణ, కూల్చివేత ప్రదేశాలలో దుమ్ము నియంత్రణ చర్యలు కూడా అమలు చేయనున్నారు.
అదనంగా, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులను నియమిస్తారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని నియంత్రించడానికి పార్కింగ్ ఫీజు పెంచుతారు. మెట్రో, ఆర్టీసీ సహా ప్రజా రవాణా కోసం అదనపు సర్వీసులు ప్రారంభిస్తారు. ప్రజా రవాణాను ఉపయోగించాలని, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. ఆటోమొబైల్స్లో సూచించిన సమయంలో ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా మార్చాలి. అక్టోబర్ నుంచి జనవరి వరకు కాలుష్యాన్ని పెంచే నిర్మాణ పనులను నివారించాలని చెప్పారు. అలాగే, బయట వ్యర్థాలను తగలరాదని ఆదేశించారు. అక్టోబర్ 1 నుంచి అమలులో ఉన్న స్టేజ్-1 ప్లాన్కు ఇది అదనంగా ఉంది. వాయు నాణ్యత 401 నుంచి 450 కి పడిపోతే స్టేజ్-3 అమల్లోకి తీసుకొచ్చి, వాయు కాలుష్యానికి కారణమయ్యే మరిన్ని కార్యకలాపాలపై ఆంక్షలు విధించనున్నారు.
వాతావరణంలో సూక్ష్మ పరిమాణంలో ఉండే పీఎం 2.5 (పార్టికులేట్ మ్యాటర్) కాలుష్య కణాలు నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. దీనికి తోడు వాతావరణంలోకి విడుదలయ్యే ఇతర కర్బన ఉద్గారాల ప్రభావం ఢిల్లీపై తీవ్రంగా పడుతోంది. ఈ కారణాల వల్ల ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఢిల్లీ మారిపోయింది. శీతాకాలంలో తక్కువ వేగంతో గాలులు వీయడంతో కాలుష్య కణాలను దిగువ వాతావరణ పొరల్లో నిలిచేలా చేస్తయి. దీని వల్ల కాలుష్యం పెరిగి, గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతుంది.