Sports

Ind vs NZ Test: సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీ.. మళ్ళీ వర్షం అంతరాయం!

భారత యువ బ్యాటర్, సర్ఫరాజ్ ఖాన్ సత్తాచాటాడు. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ.. తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. బెంగళూరు వేదికగా కివీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో 110 బంతుల్లోనే శతకం బాదాడీ యువ బ్యాటర్. తన నాలుగో టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ దాహం తీర్చుకున్నాడు. అంతకుముందు 68 అతడి అత్యధిక స్కోరు. సగటు 50కి పైనే ఉంది. ఇక ఓవర్‌నైట్ స్కోరు 70 తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్ఫరాజ్.. మొదటినుంచే న్యూజిలాండ్ బౌలర్లను చాలా సులభంగా ఎదుర్కొన్నాడు. ఏ దశలోనూ తడబాటుకు గురికాలేదు. అడపాదడపా ఫోర్లు, సిక్సర్లతో.. చూడచక్కని షాట్లతో అలరించాడు. పంత్‌‌తో కలిసి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు.

నాలుగో రోజు రెండు గంటల ఆట తర్వాత.. మరోసారి వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. దీంతో ముందుగానే లంచ్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 344 పరుగులతో ఉంది. ఇక సర్ఫరాజ్ ఖాన్ (154 బంతుల్లో 125 పరుగులు), రిషభ్ పంత్ (56 బంతుల్లో 53 పరుగులు) చేసి క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరుకు భారత్ 12 పరుగుల దూరంలో ఉంది. చేతిలో ఇంకా 7 వికెట్లు ఉండగా.. దీనిని భారత్ ఎక్కడివరకు తీసుకెళ్తుందనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది.

తొలి ఇన్నింగ్స్‌‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత న్యూజిలాండ్ ఏకంగా 402 రన్స్ చేసి.. 356 పరుగుల ఆధిక్యం సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం టీమిండియా అదరగొడుతోంది. ఇక ఓపెనర్లు జైశ్వాల్ (35), రోహిత్ శర్మ (52) దూకుడుగా ఆడారు.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (70), సర్ఫరాజ్ రాజ్ ఖాన్ కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 136 రన్స్ జత చేశారు. అయితే చివరి బంతికి కోహ్లీ అవుట్ కాగా.. భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. అయితే నాలుగో రోజు సర్ఫరాజ్‌కు జత కలిసిన పంత్ కూడా ధాటిగానే ఆడుతున్నాడు.

పంత్ కాస్త ఇబ్బంది పడినా.. క్రీజులో కుదురుకున్నాక మాత్రం బాగా ఆడుతున్నాడు. అతను కేవలం 56 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 రన్స్ చేసాడు. ఇంకా రాబోయే KL రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి బ్యాటర్లు కూడా పరుగులు చేయగలరు. దీంతో కివీస్ ముందు ఎంత లక్ష్యం నిర్దేశిస్తుందో చూడాలి. ఒకవేళ 200 రన్స్ కంటే ఎక్కువ ఆధిక్యం ఉంటేనే.. భారత్ గెలిచే అవకాశాలు ఉంటాయి. గెలిస్తే మాత్రం సంచలనం అనే చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version