Telangana

హైదరాబాద్ హోటల్స్‌లో తనిఖీలు.. మేయర్ విజయలక్ష్మి హెచ్చరికలు..

హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా.. హోటల్స్‌లో అపరిశుభ్రత, రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, సరైన నిబంధనలు పాటించకపోవడం, కస్టమర్లకు వడ్డించిన ఆహారంలో పురుగులు, క్రిములు, కీటకాలు కనిపించడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇక సోషల్ మీడియాలో బాధితులు వాటికి సంబందించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా.. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. పలు హోటల్స్‌ను సీజ్ చేయడం, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నగరంలోని పలు హోటల్స్‌లో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

లక్డీకపూల్‌ పరిధిలో ఉన్న హోటల్స్‌కు గద్వాల విజయలక్ష్మి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్‌తో కలిసి.. ఆయా హోటల్స్‌లో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఇక మొఘల్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు చేసిన మేయర్‌ విజయలక్ష్మి.. ఆహార పదార్థాలను, వాటిని తయారు చేసే విధానాన్ని దగ్గరుండి మరి పరిశీలించారు. ఈ సందర్భంగా మొఘల్ రెస్టారెంట్ కిచెన్‌ శుభ్రంగా లేకపోవడంతో సంబంధిత ఓనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించకుండా మాంసం నిల్వ చేయడంపై యజమానిని నిలదీశారు. ఈ క్రమంలో హోటల్‌లో నిల్వ చేసిన మాంసంను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపించగా.. రిపోర్ట్ వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటామని మేయర్‌ విజయలక్ష్మి హెచ్చరించారు.

ఇక నిన్న నాగోల్‌లోని కొన్ని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్, దసరా రెస్టారెంట్, నవరసా రెస్టారెంట్లు నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. ఇక నాన్ వెజ్ పదార్థాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేల్చారు. అంతేకాకుండా కాలం చెల్లిన బ్రెడ్, మిల్క్ ప్యాకెట్లు, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, సాస్‌లను కూడా ఆహార పదార్ధాల తయారీలో ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కిచెన్ అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా.. బొద్దింకలు, ఇతరు కీటకాలు తిరుగుతున్నట్లు తనిఖీల్లో తేలింది. ఇక దసరా రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన మటన్‌ను వాడుతున్నట్లు గుర్తించారు. దీంతో పలు ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా హోటల్, రెస్టారెంట్ ఓనర్లకు నోటీసులు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version