Andhra Pradesh

తిరుమలలో అపచారం.. మళ్లీ జరిగిన అదే తప్పు..

తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం స్వామివారి ఆలయానికి దగ్గర హెలికాప్టర్ వెళ్లింది. కొందరు భక్తులు చూసి తమ మొబైల్‌లో రికార్డ్ చేశారు. కొంత మంది భక్తులు ఈ విషయం టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తెలిపారు.

ఆలయం మీదుగా వెళ్లిన ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని గతంలోనే.. పలు సందర్భాల్లో కేంద్రాన్ని టీటీడీ కోరింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టికి మాత్రం ఈ నిబంధన అమలు చేయడం వీలుకాదని తెలిపింది.

గత రెండు, మూడేళ్లుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగిరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో అలాంటి ఘటనలు జరిగినప్పుడు భక్తుల మనోభావాలను చూసి టీటీడీ స్పందించింది. కొంతకాలంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు స్వామివారి ఆలయం మీదుగా వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ విమానాలు, హెలికాప్టర్లు ఆలయం మీదుగా చక్కర్లు కొట్టడం వల్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గతేడాది జనవరిలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ వీడియో కనిపించిన వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్య తీసుకున్నారు. వెంటనే అతనిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన వ్యక్తి హైదరాబాద్‌ నిపుణుడిగా గుర్తించారు.

కేసులు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత, హర్యానాకు చెందిన మరో వ్యక్తి కూడా తిరుమల సమీపంలో డ్రోన్‌ను ఎగురవేశారు. ఈ విషయంలో కూడా వివాదాస్పదం అయ్యింది. ఆ తర్వాత మరో యువకుడు తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఏకంగా మొబైల్ తీసుకెళ్లి.. లోపల వీడియోను తీశాడు. ఈ వీడియో కూడా వైరల్ కాగా అతడిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

గతంలో కూడా తిరుమలలో శ్రీవారి ఆలయం మాత్రమే కాదు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి భవనం, బాలాజీనగర్ పై నుంచి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన ఘటనలు జరిగాయి. తిరుమల కొండపై తరచూ ఇలా హెలికాప్లర్లు ఎగరడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. వెంటనే టీటీడీ అధికారులు రేణిగుంటలోని విమానాశ్రయం అధికారులను సంప్రదించగా క్లారిటీ ఇచ్చారు. ఆ హెలికాప్టర్లు భారత వాయుసేనకు చెందినవిగా తెలిపారు. ఇవి కడప బేస్ క్యాంప్ నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో ఇటువంటి రీతిలో వచ్చాయని వివరించారు. జూన్‌లో కూడా విమానం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా ఎగిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version