Andhra Pradesh

పవన్‌పై రోజా ట్వీట్.. డిప్యూటీ సీఎం రియాక్షన్

పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మైనర్ బాలికకు మద్యం తాగించి బలాత్కారం చేయడం స్థానికంగా సంచలనం రేపింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో మహిళలకు భద్రత లేదా అంటూ ప్రశ్నిస్తోంది. ఇదే విషయమై వైసీపీ అధికార ప్రతినిధి రోజా సైతం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం సొంత ఇలాఖాలోనే ఓ మైనర్ బాలికపై దారుణం జరిగితే చర్యలేవంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మాజీ మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్‌కు ట్వీట్ చేశారు.

“పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ.. మీరు పంచె ఎగ్గట్టాల్సింది.. గుడి మెట్లపై కాదు… విజయవాడ వరద బాధితుల కోసం! మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది నడిరోడ్డుపై కాదు.. వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం! మీరు గొడవ పడాల్సింది.. మతాల కోసం కాదు.. నీట మునిగి సాయమందని పేదల కోసం! మీరు కడగాల్సింది మెట్లను కాదు.. ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతిని! మీరు దీక్ష చేయాల్సింది ప్రసాదాల కోసం కాదు.. రాష్ట్రంలో రాలిపోతున్న ఎంతో మంది చిన్నపిల్లల మానప్రాణాల కోసం!” అంటూ రోజా ట్వీట్ చేశారు.

“మీరు ఉపవాసం ఉండాల్సింది దేవుళ్ల కోసమే కాదు.. ఆహారం కలుషితమై ఆసుపత్రి పాలౌతున్న విద్యార్థుల కోసం! మీరు బొట్లు పెట్టాల్సింది గుడిమెట్లకు కాదు.. బాగుపరిచిన బడిమెట్లకు.. మీరు డిక్లరేషన్ ప్రకటించాల్సింది ఏ లోటూలేని సనాతనం కోసం కాదు.. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాల కోసం! మీరు సంప్రోక్షణ చేయాల్సింది.. కల్తీ జరిగిందో లేదో తెలియని లడ్డూ కోసం కాదు.. ప్రజలకు ఇసుకే దొరకకుండా చేసిన కూటమి నాయకుల అవినీతి ప్రక్షాళన కోసం! మీరు దృష్టి పెట్టాల్సింది పక్క రాష్ట్రాల నాయకుల మాటపై కాదు.. మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు పాల్పడుతున్న మీ నాయకులపైన! దేవుడు తమరికి పుట్టుకతో బుద్ది జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి పవన్ కళ్యాణ్ స్వామీ” అంటూ రోజా ట్వీట్ చేశారు.

అయితే పిఠాపురం ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద జ‌రిగిన అఘాయిత్యం బాధ కలిగిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు వెంటనే అప్రమత్తమైన నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలన్న డిప్యూటీ సీఎం.. ఆస్పత్రిలో ఉన్న బాలికకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బాధితురాలిని ఆదుకోవటంతో పాటుగా కారణమైన వారికి కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version