Telangana

ఈ మనుషులు శ్మశానాన్ని కూడా వదలట్లేదు.. ఎవరూ లేని టైం చూసి..

రాను రాను కొందరి కక్కుర్తికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డబ్బు సంపాదించటం కోసం పలువురు రకరకాల అడ్డదార్లు తొక్కుతున్నారు. ఒక వైపు పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్రభుత్వాలు నెత్తీ నోరు కొట్టుకుంటుంటే.. మరోవైపు కొందరు మనుషులు మాత్రం ఉన్న చెట్లను కొట్టేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొన్నటివరకు అడవుల మీద పడిన ఆ అక్రమార్కులు ఇప్పుడు అక్కడ చెట్లు కొట్టటం వీలు పడకపోతుండటంతో.. ఇప్పుడు ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ గొడ్డలికి పని చెప్తున్నారు. చివరికి శ్మశానాన్ని కూడా వదలకుండా.. అక్కడున్న చెట్లు కూడా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనే జరిగింది. అది కూడా.. ఫారెస్ట్ కార్యాలయానికి అతి సమీపంలోనే జరగటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం గోధుమ వాగు పక్కన ఉన్న మున్సిపల్ వైకుంఠధామంలో ఉన్న టేకు చెట్లను కొందరు అక్రమార్కులు నరికేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గతంలో నాటిన కొన్ని టేకు చెట్లు.. ఏపుగా పెరగటంతో వాళ్ల దృష్టి ఆ చెట్లపై పడింది. రాత్రి ఎవరూ లేని సమయంలో.. కటింగ్ మిషన్ ద్వారా టేకు చెట్లను కోసి, వాటిని చిన్న సైజులుగా తయారు చేసి, వాహనాల ద్వారా కలప మిల్లుకు తరలిస్తున్నట్టుగా అర్ధమవుతుంది. చెట్లను కొసిన తర్వాత.. పనికొచ్చే దుంపలను తరలించి.. మిగితా కొమ్మలను అక్కడే అడ్డదిడ్డంగా వేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది అనమాట.

అయితే అడ్డదిడ్డంగా వేసిన కొమ్మలు ఇప్పుడు అక్కడికి వచ్చే ప్రజలకు అసౌకర్యంగా బావిస్తుండడంతో.. ఆ కొమ్మలు అక్కడ ఎవరేశారన్నది చర్చకు దారి తీసింది. దీంతో.. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే.. శ్మశానంలోని టేకు చెట్లను కొట్టేసి.. దందా నడిపిస్తున్నారని సామాన్యులు ఆరోపిస్తున్నారు. అది కూడా.. అటవీ శాఖ కార్యాలయానికి అతి దగ్గర లో ఉన్న శ్మశానంలో ఏపుగా పెరిగిన టేకు చెట్లు కొట్టేయడం మరింత చర్చకు దారి తీసింది.

అయితే.. రామవరం గోధుమ వాగు స్మశానంలో రాత్రి సమయంలో జరుగుతున్న ఈ కలప దందా వెనక కొందరి రాజకీయ నాయకుల హస్తం ఉందని అక్కడ ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ దందా అటు అటవీ శాఖ అధికారులకు.. ఇటు రవాణా శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరి మెదళ్లలో ఉన్న ప్రశ్న.

ఇక ఈ చెట్ల నరికివేత అంశంపై స్పందించిన రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. టేకు చెట్ల నరికివేతకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. అటవీ సంపదను కాపాడేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని శ్రీనివాస రావు తెలియజేసారు. చెట్లు నరికివేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version