Telangana

నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులతో పాటు వారి కుమారుడు ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ గ్రామానికి చెందిన సురేష్ (53), హేమలత (45) దంపతులు.. వీరి కుమారుడు హరీష్ (22) గత కొంత కాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడిపోయాడు. ఈ క్రమంలో పబ్జీ గేమ్‌లో రూ. 30 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిసింది. ఆ అప్పులు తీర్చేందుకు సురేష్ తనకున్న పొలం కూడా అమ్ముకున్నారు.

అయినా అప్పులు తీరకపోవడంతో మనస్థాపం చెంది నిన్న రాత్రి ఇంట్లో ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది. ఆన్‍లైన్ గేమ్స్.. ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నాయని ఇరుగు పొరుగు వారు కంటతడి పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి.. పోస్టుమర్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయిన ఒక వ్యాపారి సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి సూసైడ్‌కు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఇదారి నవీన్‌ (27) గ్రామంలోనే ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే ఈజీగా డబ్బులు సంపాదించేందుకు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు.

బెట్టింగ్ కి బానిసైన నవీన్‌ దాదాపుగా రూ.26 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవటంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తన షాపులోని పురుగుల మందును సేవించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే దురదుష్టవశాత్తు మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చేతికందిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version