Entertainment

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఒక డాక్టర్‌..

విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ క్రిష్‌ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్‌ ప్రీతి చల్లా అనే ఆమెను వివాహమాడారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ పెళ్లి వేడుకకి ఇరు కుటుంబ సభ్యులు సహా అతి కొద్దిమంది సెలబ్రెటీలు మాత్రమే హాజరయ్యారు.

ఇక ఈ పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌కి చెందిన ప్రీతి చల్లా గైనకాలజిస్ట్‌గా హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. గతంలో ప్రీతికి పెళ్లి అయింది.. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆమెకి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వీరి ఇద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో వీరు ఈ పెళ్లితో ఒక్కటయ్యారు.

ఇక క్రిష్ కూడా కొన్ని సంవత్సరాల ముందు రమ్య అనే వైద్యురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి అప్పట్లో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. కానీ మనస్పర్థల కారణంగా కొన్నాళ్లకే క్రిష్‌, రమ్య విడిపోయారు. ప్రస్తుతం రమ్య USలో మరో పెళ్లి చేసుకుని సెటిల్‌ అయినట్లు అర్ధమవుతుంది. కానీ క్రిష్ మాత్రం ఇన్నాళ్లూ ఒంటరిగానే ఉన్నారు.

మరోవైపు కెరీర్ విషయానికొస్తే క్రిష్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 16 ఏళ్లు పూర్తయింది. కానీ ఆయన చేసిన సినిమాలు మాత్రం కొన్నే. అయితే విభిన్నమైన కథాంశాలతో ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. శర్వానంద్- అల్లరి నరేష్‌తో తీసిన ‘గమ్యం’ చిత్రంతో ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా పరిచయమయ్యారు క్రిష్. ఆ తర్వాత ‘వేదం’ చిత్రంతో మరోసారి తన మార్క్ చూపిస్తూ సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఇదే చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేశారు క్రిష్.

ఆ తర్వాత కృష్ణం వందే జగద్గురుమ్, కంచె సినిమాలకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక బాలకృష్ణ తో గౌతమిపుత్ర శాతకర్ణి, NTR కథానాయకుడు, NTR మహానాయకుడు సినిమాలు తీశారు క్రిష్. ఇవేమీ కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయాయి. దాంతో ఇక బాలీవుడ్‌కి వెళ్లి కంగనా రనౌత్‌తో మణికర్ణకి: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ అంటూ పీరియాడికల్ డ్రామాను తీశారు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్‌తో తీసిన కొండపొలం చిత్రానికి అవార్డులు దక్కాయి కానీ సరైన కలెక్షన్లు మాత్రం రాలేదు.

ఇక ప్రస్తుతం అనుష్కతో ఘాటీ చిత్రాన్ని తీస్తున్నారు క్రిష్. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ ఇటీవల అనుష్క బర్త్‌డే సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది. అనుష్కను చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు క్రిష్. ఈ మూవీ ఖచ్చితంగా క్రిష్‌కి సక్సెస్ ఇస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version