Andhra Pradesh

అన్నమయ్య జిల్లాలో సీఐ తల్లిని కిడ్నాప్ చేసి చంపేసిన దుండగుడు

అన్నమయ్య జిల్లా ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి అదృశ్యం విషాదాకరమైంది. ఆమె కిడ్నాప్ చేసిన వ్యక్తి చేతిలో హత్యకు గురైంది. పది రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోగా.. తాజాగా ఆమె మృతి చెందినట్లు తేలింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చింది. డబ్బులకు సంబందించిన వ్యవహారంలోనే ఈ కిడ్నాప్, హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. ధర్మవరం వన్‌టౌన్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర ప్రసాద్‌ తల్లి స్వర్ణకుమారి మదనపల్లె శివారులోని ఓ కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటుంది. పోయిన నెల 29న ఉదయం 10 గంటలకు ఆమె తన ఎదురింట్లో నివాసం ఉంటున్న వెంకటేశ్‌ అనే వ్యక్తితో.. దైవ భక్తి ఎక్కువగా ఉండే స్వర్ణ కుమారి పుంగనూరు రోడ్డులో ఉన్న ఓ స్వామి వద్దకు వెంకటేష్ బైక్‌పై వెళ్లింది. అయితే అదే అదనుగా వెంకటేశ్‌ ఆమెను కిడ్నాప్‌ చేశాడు. ఆ తర్వాత ఆమెను చంపేసి.. మదనపల్లి టూటౌన్‌ పరిధిలో ఆ మృతదేహాన్ని పాతిపెట్టాడు.

ఇక సాయంత్రమైనా స్వర్ణకుమారి ఇంటికి రాకపోవడంతో ఇరుగు పొరుగువారు ఆమెకు కాల్ చేశారు. అయినా ఆమె స్పందించలేదు. దైవభక్తి ఎక్కువగా ఉండటంతో ఏదైనా దూర ప్రాంతంలోని గుడికి వెళ్లి ఉంటుందని అందరు అనుకున్నారు. అయితే రెండ్రోజులైనా ఆమె ఇంకా ఇంటికి రాకపోవటంతో ఈ విషయాన్ని ఆమె కుమారుడు నాగేంద్ర ప్రసాద్‌కు ఫోన్ చేసి చెప్పారు. దాంతో మదనపల్లెకు చేరుకున్న సీఐ నాగేంద్ర ప్రసాద్.. తన తల్లి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడ ఆమె ఆచూకీ లభించకపోవటంతో మదనపల్లె టూ టౌన్‌ పీఎస్‌లో మిస్సింగ్ కంఫ్లైంట్ ఇచ్చాడు. దాంతో కేసు విచారణ మొదలుపెట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు వెంకటేశ్‌ను బెంగళూరులో పట్టుకున్నారు.

ఇక అతడిని విచారించగా.. స్వర్ణకుమారి దగ్గర అతను ఎక్కువ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు చెప్పాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని ఆమె ఒత్తిడి తేవటంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని మదనపల్లెలోనే పాతి పెట్టినట్లు తెలిపాడు. అతడిని క్రైం స్పాట్‌కు తీసుకెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఏపీలోని శాంతి భద్రతలపై ఆందోళన మొదలైంది. అందరికీ రక్షణగా ఉండే పోలీసుల కుటుంబ సభ్యులకే రక్షణ లేకపోవటంతో ఏపీలో తీవ్ర కలకలం రేగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version