Andhra Pradesh

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. పంచ్ ప్రభాకర్‌పై కేసు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. పంచ్ ప్రభాకర్‌పై కేసు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో చేసిన వ్యాఖ్యల ప్రభావం కనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను దూషిస్తూ వీడియోలు పెట్టిన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు పంచ్ ప్రభాకర్‌తో పాటు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న మరొక ఇద్దరిపై కేసులు పెట్టారు.

పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఎంత సంచలనం రేపాయో తెలిసిన సంగతే. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే.. శాంతిభద్రత విషయంపైనా, పోలీసుల పనితీరుపైనా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే సోషల్ మీడియాలో ఇష్టానుసారం అసభ్యకరమైన పోస్టులు పెట్టడం భావప్రకటనా స్వేచ్ఛ అవుతుందా అంటూ ప్రశ్నించారు పవన్. పోలీసులు గతంలోలా నిర్లిప్తంగా వ్యవహరించడం సరికాదని, తప్పుచేసిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యం లేకపోతే పోలీసులు ఎందుకని పవన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా స్పందించారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, వీడియోలు పెట్టేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను దూషిస్తూ గతంలో సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు పెట్టిన పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదైంది. వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్‌తో పాటుగా మరో ఇద్దరిపై విజయవాడ సైబర్‌క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. పంచ్ ప్రభాకర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫోటోలను ఉపయోగించి వారిని దూషిస్తూ వీడియోలు పెట్టాడని మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వి. బాయిజయంతి అనే ఎక్స్‌ అకౌంట్ హోల్డర్‌పై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్‌ను దూషిస్తూ పోస్టులు పెట్టినట్లు చెప్పిన పోలీసులు ఒక వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సోషల్ మీడియా వ్యవహారం చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనంగా ఉండకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలిసింది. ఫిర్యాదులు వస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ అభిప్రాయపడ్డారని సమాచారం. కొన్ని అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మంత్రులు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version