Andhra Pradesh

ఏపీ IAS వాణీ ప్రసాద్‌ కారుకు ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు..

ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీ ప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు.. ఓ వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాణీ ప్రసాద్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఆమె వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.. వాణి ప్రసాద్ హైదరాబాద్ నుంచి అమరావతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అర్ధమవుతుంది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు.

ఇటీవల వాణీ ప్రసాద్ తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి.. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో జాయిన్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం వాణీ ప్రసాద్‌ను కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. కార్మికశాఖ అదనపు బాధ్యతలు చూస్తున్న ఎం.ఎం. నాయక్‌ను ప్రభుత్వం రిలీవ్ చేసింది.

రాష్ట్ర పునర్విభజన సమయంలో జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, డి.రొనాల్డ్‌రాస్‌లు ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. అలాగే ఏపీ నుంచి ఐఏఎస్ అధికారులు సృజన, హరికిరణ్, శివశంకర్‌‌లు తెలంగాణకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఐఏఎస్ అధికారులు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు.. కానీ అక్కడ ఊరట దక్కలేదు. వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా అదే పరిస్థితి.

హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో ఐఏఎస్‌ అధికారులు రొనాల్డ్‌రాస్, కాటా ఆమ్రపాలి, వాణీప్రసాద్, వాకాటి కరుణలు తెలంగాణ నుంచి రిలీవ్‌ అయ్యారు.. తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశాలతో సాధారణ పరిపాలన శాఖ అధికారులు వారిని రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీలో చేరుతున్నట్లు సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు మెయిల్‌ పంపారు. అలానే ఏపీ నుంచి రిలీవ్‌ అయిన ఐఏఎస్‌ అధికారులు సృజన, శివశంకర్‌, హరికిరణ్ లు హైదరాబాద్‌కు వచ్చి సీఎస్‌ శాంతికుమారికి రిపోర్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version