Andhra Pradesh

పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏపీలో వాలంటీర్లను కొనసాగిస్తారా, లేదా..!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో సర్పంచ్ సంఘాలతో సమావేశం కాగా.. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన స్పందించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై.. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని.. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి.. పింఛన్ పంపిణీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించి పర్యవేక్షణను వాళ్లకి అప్పగించారు. అయితే ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవహారం హాట్‌టాపిక్ అయ్యింది.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈసీ వారిని విధుల నుంచి దూరంగా పెట్టింది. పింఛన్ల పంపిణీ బాధ్యతల్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు.. వాలంటీర్ల దగ్గర ఉన్న మొబైల్స్ కూడా వెనక్కు తీసుకున్నారు.

ఈ పరిణామాల మధ్య కొంతమంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.. కొంతమంది మూకుమ్మడిగా ఉద్యోగాల నుంచి తప్పుకున్నారు. వాలంటీర్ల అంశం ఎన్నికల సమయంలో పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది.. కూటమి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అయితే దీనికి సమాధానంగా తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతందని కూటమి హామీ ఇచ్చింది.. ఇంకొక అడుగు ముందుకేసి వారి జీతాన్ని నెలకు రూ.10వేలకు పెంచుతామని ప్రకటించింది.

ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా, లేదా అనే చర్చ మొదలైంది. కొన్ని సందర్భాలో చంద్రబాబు, మంత్రులు వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్నారు.. కానీ వారికి సంబంధించి ఎలాంటి నిర్ణయం మాత్రం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇకపోతే కొందరు వాలంటీర్లు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.. ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని బాధపడ్డారు. అయితే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి, మంత్రుల్ని కలిసి రిక్వెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version