Latest Updates

TAMILNADU: స్కూల్ పిల్లాడి షూలో 3 అడుగుల నాగుపాము..

తమిళనాడులో ఓ స్కూల్ పిల్లాడి షూలో 3 అడుగుల పొడవైన నాగుపాము దాక్కొని ఉంది. రాత్రి సమయంలో ఇంట్లోకి వచ్చిన నాగుపామును తరముతుండగా.. అది తప్పించుకుంది. తర్వాత చెప్పులు స్టాండ్‌లోకి దూరి నక్కింది. ఆ పాము బయటకు వెళ్లిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, తెల్లవారి చూసేసరికి పిల్లలు వేసుకునే షూలో దాక్కొని ఉంది. దీంతో అటవీ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇక స్నేక్ క్యాచర్స్ చేరుకుని.. షూలో నుంచి 3 అడుగుల పొడవైన నాగుపామును బయటకు తీశారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

కడలూర్‌ సిప్కాట్‌ దగ్గర్లో చిన్నకారైక్కాడు గ్రామానికి చెందిన విజయబాలన్‌ స్థానిక పారిశ్రామికవాడలో ఒక కాంట్రాక్టర్. వారి ఇంటిలోకి శనివారం రాత్రి నాగుపాము ప్రవేశించడంతో కుటుంబసభ్యులు భయపడిపోయారు. విజయబాలన్ దాన్ని బయటకు తరమడానికి ప్రయత్నించగా అది చెప్పులు స్టాండ్ వద్దకు వెళ్లి పిల్లలు వేసుకొనే స్కూల్ షులోకి దూరింది. అందులో ఉన్నట్టు ఉదయం గుర్తించిన విజయబాలన్‌ వెంటనే అటవీశాఖ సిబ్బందికి తెలియజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది.. షూలో ఉన్న 3 అడుగుల పొడవు నాగుపాముని పట్టుకొని అడవిలో వదిలేసారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇళ్లలోకి పాములు, విష కీటకాలు చొరబడుతున్నాయి.

ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు వర్షాకాలంలో పాములు, తేళ్లు వంటివి దూరే ప్రమాదం ఉంది కాబట్టి చెప్పులు వేసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బూట్లు వేసుకునే ముందు వాటిని షేక్ చేయాలని, ఏవైనా అందులో దూరితే ముందే తెలుస్తుందని చెబుతున్నారు. చూసుకోకుండా వాటిని ధరిస్తే.. ఒకవేళ పాములు వంటి కీటకాలు దాక్కుంటే ప్రమాదంలో పడతారని హెచ్చరిస్తున్నారు. బైక్‌లు, హెల్మెట్లలోకి పాములు దూరిన సందర్భాలు అనేకం. అలాగే, వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగి.. పాములు వంటి సరీసృపాలు కొట్టుకొచ్చి.. ఇళ్లలో దూరుతుంటాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండేవారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇళ్లలోకి విష జంతువులు చేరి.. ప్రమాదాలు బారినపడుతుంటారు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version