International

మరోసారి ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. ఆ వస్తువులపై 10 శాతం, 25 శాతం విధింపు

Americans' New Tax Rates Depend on Who They Are and What They Do - Bloomberg

ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. ఫర్నిచర్, కలపపై టారిఫ్ పిడుగులు వేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రకటన చేసిన ట్రంప్.. తాజాగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కలపపై 10 శాతం.. ఫర్నీచర్‌పై 25 శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు. ముందుగా చెప్పినట్టుగానే.. ఫర్నిచర్‌, కలపపై సుంకాల మోత మోగించారు. కిచెన్‌ క్యాబినెట్‌, బాత్‌రూమ్‌ పరికరాలతో పాటు అప్‌హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవలె ట్రంప్‌ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు తాజాగా కలపపై 10 శాతం.. కిచెన్ క్యాబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను తాజాగా విధించారు. ఇవి వచ్చే నెల (అక్టోబరు 14వ తేదీ) నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

చైనా సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా ఫర్నిచర్ వ్యాపారానికి కేంద్ర స్థానంగా ఉండే అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రం దాని ప్రాభవాన్ని కోల్పోయిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఫర్నిచర్‌ తయారు చేయకపోతే భారీ స్థాయిలో టారిఫ్‌లను వేస్తామని తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌లో హెచ్చరించారు. ఇక ఇప్పటికే.. సిమాలపై కూడా ట్రంప్‌ భారీగా సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా బయట నిర్మించే సినిమాలపై 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు సంబంధిత విశ్లేషకులు చెబుతున్నారు.

దీంతో సోమవారం మరోసారి సుంకాల రూపంలో అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములపై డొనాల్డ్ ట్రంప్ దాడి చేశారు. ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. దిగుమతి చేసుకుంటున్న కలప, ఫర్నిచర్ ఉత్పత్తులు అమెరికా జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని వాదించారు. ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 232 కింద ఈ డ్యూటీలను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా కలప పరిశ్రమ బలహీనపడటం వల్ల కలప మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని.. జాతీయ భద్రత, క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు అవసరమైన కలప ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చలేమని ఆ ప్రకటనలో తెలిపారు.

ఈ టారిఫ్‌ల పెంపుతో అప్‌హోల్‌స్టర్డ్ కలప ఉత్పత్తులపై సుంకాలు 30 శాతానికి.. కిచెన్ క్యాబినెట్‌లపై 50 శాతానికి పెరుగుతాయి. అయితే ఇది అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోని దేశాలకు మాత్రమే వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కలప ఉత్పత్తులతో పాటు, పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్స్, భారీ ట్రక్కుల దిగుమతులపైనా సుంకాలు విధిస్తామని గత వారమే ట్రంప్ ప్రకటించారు.

తాజాగా తీసుకున్న ఈ చర్యలు అమెరికాకు కలపను సరఫరా చేసే అతిపెద్ద దేశమైన కెనడాపై అదనపు భారం పడనుంది. ఇప్పటికే ఆ దేశం 35 శాతం యాంటీ డంపింగ్ టారిఫ్‌లను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు చైనా ఫర్నిచర్‌పై సుంకాలు విధించడంతో.. ఆ ఉత్పత్తులను ఇప్పుడు మెక్సికో, వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ దేశాల ఫర్నిచర్‌పైనా సుంకాలు విధించడంతో.. వాణిజ్య మార్పులకు తీవ్ర అడ్డంకిగా మారనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనా ఫర్నిచర్‌పై గతంలో 25 శాతం ఉన్న సుంకం ఇప్పుడు దాదాపు 55 శాతానికి పెరిగింది.

ట్రంప్ చేసిన ప్రకటనతో బ్రిటన్ నుంచి వచ్చే కలప ఉత్పత్తులపై సుంకాలు 10 శాతానికి.. యూరోపియన్ యూనియన్, జపాన్ ఉత్పత్తులపై 15 శాతానికి పరిమితం కానున్నాయి. అయితే వియత్నాంతో కుదుర్చుకున్న 20 శాతం సుంకం ఒప్పందం గురించి ప్రకటనలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సుంకాలను యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవి అమెరికన్ వ్యాపారాలు, ఇంటి నిర్మాణ ఖర్చులను పెంచుతాయని.. ఉద్యోగాల కోతకు దారితీస్తాయని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version