Andhra Pradesh

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ సమీక్ష

భోగాపురం ఎయిర్‌పోర్టును గడువు కంటే ముందే పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు  విశ్వాసం - తెలుగు360

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటైన భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 86 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ, కాంట్రాక్ట్ సంస్థ GMR పనులు ఆపకుండా ముందుకు తీసుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. విజయనగరంలో విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్ట్ ప్రగతిని పరిశీలించారు.

విమానాశ్రయం పనుల పూర్తి కాగానే ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ విమానాశ్రయం కొత్త అవకాశాలను తెస్తుందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు, ఉత్తర ఆంధ్రకు పెట్టుబడులను ఆకర్షించగలదని ఆయన వివరించారు.

మరోవైపు, కనెక్టివిటీ పనులపై కూడా దృష్టి పెట్టినట్టు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వైజాగ్ నుంచి భోగాపురం వరకు రోడ్డు కనెక్టివిటీ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుకు సులభంగా చేరుకునేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

బీచ్ కారిడార్ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే DPR సిద్ధమైందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ కారిడార్ పూర్తయితే పర్యాటక రంగానికి కూడా మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయిన తర్వాత, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version