Business
భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు..!
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అసలు ఊహించని రీతిలో జోరందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లాభాలు, నష్టాలతో సాగిన మార్కెట్లు ఇవాళ ఒక్కసారిగా ఎగసిపడాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో షేర్లలో భారీ కొనుగోళ్ల జోరు కనిపించింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,046 పాయింట్లు ఎగిసి 82,408 వద్ద ముగిసింది. అలాగే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ సైతం 319 పాయింట్ల లాభంతో 25,112 మార్కును తాకింది. మార్కెట్లకు ఇది మరో కొత్త రికార్డు.
ఈ ఊపుకు అసలైన కారణం ఏమిటంటే.. రిజర్వ్ బ్యాంక్ తాజాగా ప్రకటించిన కొన్ని కీలక నిర్ణయాలు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ రంగానికి సంబంధించి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు RBI వెల్లడించింది. దీని వల్ల భవిష్యత్లో ప్రాజెక్టులకు నిధుల లభ్యత మెరుగుపడనుంది. దీనికి మద్దతుగా ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లను భారీగా కొనుగోలు చేయడం వల్ల మార్కెట్కు పుంజుకుంది.
Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ – టెక్నాలజీ, ఫైనాన్స్ మిళితంగా ఉండటంతో ఇన్వెస్టర్లకు భరోసా కలిగించింది.
Airtel – డేటా రంగంలో విస్తరణకి పెట్టుబడులు పెరగనున్నాయి అనే అంచనాలతో ర్యాలీ చేసింది.
ట్రెంట్, మహీంద్రా & మహీంద్రా (M&M), భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా లాభాల్లో ముందంజలో నిలిచాయి.
అయితే.. మరోవైపు కొంతమంది వెనకడుగు వేసిన స్టాక్స్ కూడా ఉన్నాయి.
బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకీ వంటి ఆటోమొబైల్ కంపెనీలకు నష్టాలు తప్పలేదు. పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్, కొత్త ఉత్పత్తులపై మార్కెట్లో ఉన్న అనిశ్చితి కారణంగా ఇవి వెనుకబడ్డాయి. అలాగే, డాక్టర్ రెడ్డీస్ వంటి ఫార్మా కంపెనీలు స్వల్ప నష్టాల్లోనే ముగిశాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే— బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల అండతో మార్కెట్లు ఈ రోజు జోష్ చూపించాయి!