Environment
తెలంగాణలో నదుల ఉగ్రరూపం
తెలంగాణలో వరద పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. భారీ వర్షాలతో గోదావరి, మంజీరా నదులు ఉద్ధృతంగా పారుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4.30 లక్షల క్యూసెక్కుల ఇన్ప్లే వస్తుండగా, 5.30 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు జారీచేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు.
మంజీరా నది ఉగ్రరూపం కారణంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా దేవి ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ప్రతీ ఏటా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే ఈ ఆలయం వద్ద వరద నీరు పొంగిపొర్లడంతో అక్కడి దర్శనాలు, పూజా కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక భక్తులు ఆందోళన చెందుతుండగా, అధికారులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పర్యవేక్షణ చేస్తున్నారు.
ఇక గోదావరి ఉద్ధృతితో ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వరద ముప్పు దృష్ట్యా అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచి, అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారు.