Politics
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు మూడు పార్టీల గుట్టు ఒప్పందం? విజయశాంతి సంచలన ఆరోపణలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వేడి రోజుకో మెట్టు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాటల్లో, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు తథ్యమనే విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ కలిసి ఒక రహస్య డీల్ కుదుర్చుకున్నాయని ఆరోపిస్తున్నారు.
విజయశాంతి ప్రకారం, బీజేపీ తన అభ్యర్థిని డమ్మీగా బరిలోకి దింపి, అసలైన గెలుపు బీఆర్‌ఎస్ ఖాతాలో వేసేందుకు వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు.. ఇక టీడీపీ అయితే, పైకి బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించినా, వాస్తవంగా బీఆర్‌ఎస్‌కు నిబంధనల రహితంగా తోడ్పాటును అందించేందుకు సిద్ధమైందని అన్నారు.
“బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందానికి టీడీపీ కూడా భాగస్వామ్యమైందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి,” అని ఆమె అన్నారు. టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటూ, బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నా, వాస్తవం వేరేదే అని ఆమె పేర్కొన్నారు. తెర వెనుక జరిగిన ఈ రాజకీయ వ్యవహారాలు ప్రజలకు వివరించి, కాంగ్రెస్ విజయాన్ని మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలకు విజయశాంతి పిలుపునిచ్చారు.
ఈ ఆరోపణలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల రాజకీయాలను మరింత హాట్‌టాపిక్‌గా మారుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగే ఈ గుట్టు ఒప్పందం నిజమేనని నిరూపితమైతే, అది రాష్ట్ర రాజకీయాలను భిన్న దిశగా మలుపు తిప్పే అవకాశముంది.