Andhra Pradesh
జిల్లాల పేర్లు, హద్దుల మార్పుపై 13న జీవోఎం భేటీ: అనగాని
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పేర్లు, సరిహద్దుల మార్పు అంశంపై మరోసారి చర్చ మొదలుకానుంది. ఈ నెల 13న ఈ అంశంపై మంత్రుల బృందం (GOM) భేటీ కానుందని రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం జిల్లాలను అడ్డదిడ్డంగా విభజించిందని, దాంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రజల నుంచి ఇప్పటికే జిల్లాల పేర్లు, మండలాల సరిహద్దుల మార్పు కోసం అనేక సూచనలు, అభ్యర్థనలు వచ్చాయని మంత్రి వెల్లడించారు. ఇంకా ఎవరికైనా తమ ప్రాంతం గురించి మార్పుల కోసం అభ్యర్థనలు చేయాలనుకుంటే ఇవ్వొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ అన్ని అర్జీలను సమీక్షించి, చర్చించిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై చర్చించేందుకు ఏర్పాటైన GOMలో నారాయణ, అనిత, జనార్దన్, నిమ్మల, మనోహర్, సత్యకుమార్ ఉన్నారని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.