Andhra Pradesh
గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచం అడుగుతున్నారా? వెంటనే ఈ 1064 నంబర్‌కు కాల్ చేయండి – ఏపీ ఏసీబీ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి, లంచం వంటి సమస్యలను అరికట్టేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు లంచం అడుగుతున్నారని పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో, ఏపీ అవినీతి నిరోధక శాఖ (ACB) 1064 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్ ద్వారా ప్రజలు ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా వెంటనే సమాచారం అందించవచ్చు.
ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ విశాఖపట్నంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా 1064 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. లంచం డిమాండ్ చేసిన ఉద్యోగి వివరాలు, ఆధారాలు అందించిన తర్వాత, అవి నిజమని తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అతుల్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏసీబీ శాఖలను కూడా విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో ACB ఆఫీసులు, అధికారులు, సిబ్బంది పెంచి, లంచం కేసులపై మరింత వేగంగా చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అలాగే, ఆధారాలు లేకుండా అవినీతి చేసే అధికారులను గుర్తించి, తగిన విధంగా బదిలీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజల సహకారం లేకుండా అవినీతి నిర్మూలన సాధ్యం కాదని ఏసీబీ డీజీ స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ నంబర్లు, అధికారుల వివరాలు ప్రదర్శించబడ్డాయని చెప్పారు. “ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 నంబర్‌కు కాల్ చేయండి. మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. మనందరం కలసి అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.