Andhra Pradesh
ఏపీలో భారీ పెట్టుబడి: తిరుపతిలో రూ.1800 కోట్లతో PCB ప్లాంట్
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడికి మార్గం సుస్పష్టమైంది. దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పేందుకు Syrma SGS Technology ముందుకు రావడంతో పరిశ్రమల రంగంలో కీలక అడుగు పడనుంది.
ఈ మేరకు టీడీపీ అధికారికంగా ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద రూ.1800 కోట్ల వ్యయంతో ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 2027 మార్చిలోగా ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయనుందని పేర్కొంది.
గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ప్రభుత్వం తరఫున చర్చలు కొనసాగినట్టు టీడీపీ పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన చర్చలు సఫలమై ఈ భారీ పెట్టుబడి రాష్ట్రానికి లభించిందని పేర్కొంది.
ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, నాయుడుపేట పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలవనుందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి ఇది చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.