Andhra Pradesh
ఎలక్ట్రానిక్స్ హబ్‌గా రాయలసీమను తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0పై ఆయన సమీక్ష నిర్వహించారు. చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో భూ సమస్యల వల్ల పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీకి అనుకూలంగా మలచుకోవాలని అధికారులను కోరారు. శ్రీసిటీ, హిందూపురం, కొప్పర్తి ప్రాంతాలను ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అభివృద్ధికి అనువైన వేదికలుగా గుర్తించారు.
2025 నుండి 2030 మధ్య కాలంలో పరిశ్రమలు స్థాపించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఈ క్రమంలో దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీలను సంప్రదించి పెట్టుబడుల కోసం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్స్ తయారీకి అనువైన వాతావరణం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమను ఇండియా ఎలక్ట్రానిక్స్ మ్యాప్‌లో ఓ ప్రధాన గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.