National
ఇరాన్‌లో యుద్ధ మేఘాలు: భారతీయులు వెంటనే దేశం విడిచి రావాలని కేంద్రం ఆదేశం!

అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభన యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ఇరాన్ సమీపంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించడం, మరోవైపు ఇరాన్ అంతర్గతంగా నిరసనలతో అట్టుడుకుతుండటంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయుల రక్షణే లక్ష్యంగా కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది.
భారత రాయబార కార్యాలయం ప్రధాన సూచనల ప్రకారంగా ఇరాన్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వీలైనంత త్వరగా దేశాన్ని వీడాలని సూచించింది,భారత సంతతి వారు నిరసనలు, గొడవలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరింది,పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులు వంటి అత్యవసర ప్రయాణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎంబసీ తెలిపింది.ఇప్పటి వరకు రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోని వారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది.
ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సవాళ్లు విసరగా, ఇరాన్ కూడా హర్మూజ్ జలసంధి వద్ద క్షిపణి విన్యాసాలు చేస్తూ ప్రతిస్పందించింది. టెహ్రాన్ వీధుల్లో విద్యార్థుల ఆందోళనలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి.భారత పౌరులు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.