Education
‘ఇంకాసేపే’ అనుకొంటూ రీల్స్ చూస్తున్నారా?
‘ఇంకాసేపే’ అనుకుంటూ రీల్స్, షార్ట్ వీడియోలలో మునిగిపోతున్నారా? ఈ అలవాటు మీ ఆరోగ్యానికే కాదు, మెదడుపైనా తీవ్రమైన ప్రభావం చూపుతుందని చైనా టియాంజిన్ నార్మల్ యూనివర్సిటీ తాజా అధ్యయనం హెచ్చరించింది. కేవలం వినోదం కోసం ప్రారంభమయ్యే ఈ రీల్స్, గంటల తరబడి సమయాన్ని మింగేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇది మద్యం సేవించడం కంటే ఐదు రెట్లు ఎక్కువ హానికరమని నివేదికలో పేర్కొన్నారు.
అతిగా రీల్స్, షార్ట్స్ వీక్షించడం వల్ల మెదడు పనితీరులో మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. తక్షణ సంతృప్తి కోసం మనసు దూసుకెళ్తుండడంతో స్థిరమైన ఆలోచన సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ అలవాటు కొనసాగితే వ్యక్తులు సాధారణ జీవనంలోని చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించే సామర్థ్యాన్ని కోల్పోతారని పరిశోధనలో తేలింది. అంటే మెదడు సహజ సున్నితత్వం నశించి, కృత్రిమ సంతోషం కోసం ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ నివేదిక తల్లిదండ్రులు, యువతకు ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. మద్యం లేదా ఇతర వ్యసనాల్లాగే, రీల్స్ వ్యసనం కూడా దైనందిన జీవితాన్ని దెబ్బతీయగలదని నిపుణులు చెబుతున్నారు. “ఇంకాసేపే చూస్తా” అనే తాత్కాలిక భావన క్రమంగా గంటల సమయాన్ని మింగేస్తూ, చదువు, పని, వ్యక్తిగత సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు సూచించారు. కనీసం రోజువారీగా రీల్స్ వాడకాన్ని పరిమితం చేయాలని, నియంత్రణ పాటించకపోతే తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.