Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకానికి మంచి స్పందన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. గత శుక్రవారం ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించగా, నిన్న రాత్రి 8 గంటల వరకు సుమారు 13.30 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పట్టణాల నుంచి గ్రామాల వరకు ఈ సేవపై మహిళల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక నేటి నుంచి విద్యాసంస్థలు, కార్యాలయాలు తిరిగి ప్రారంభం కావడంతో బస్సుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు బస్సులు ఎక్కేటప్పుడు క్రమశిక్షణ పాటించాలని, తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లకు సహకరించాలని సీఎం చంద్రబాబు మహిళలకు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, వారి స్వేచ్ఛాయుత ప్రయాణానికి కొత్త దారులు తెరవాలని భావిస్తోంది. అయితే అధిక రద్దీ కారణంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బస్సుల సంఖ్యను పెంచడం, సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వడం వంటి చర్యలను కూడా రవాణా శాఖ పరిశీలిస్తోంది.