Andhra Pradesh
అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగాన్ని మరింత అభివృద్ధిపరచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. తాను మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. నేతన్న భరోసా పథకం కింద ప్రతి eligible చేనేత కార్మికుడికి ఏటా రూ.25,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఇప్పటికే చెల్లుబాటు అవుతున్న అన్ని రకాల చేనేత సబ్సిడీలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇకపై చేనేత మగ్గాలపై విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇవాళ్టి నుంచే చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని పేర్కొన్నారు. ఇది చేనేత రంగానికి ఎంతగానో ఉపశమనం కలిగించనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా చేనేత ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని నిర్ణయించామని, కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు.
చేనేత సాంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి అమరావతిలో ప్రత్యేక హ్యాండ్లూమ్ మ్యూజియాన్ని స్థాపించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇది రాష్ట్ర చేనేత వారసత్వాన్ని ప్రపంచానికి చూపించే ఒక గొప్ప అవకాశం అవుతుందని పేర్కొన్నారు. ఈ మ్యూజియంలో వివిధ జిల్లాల ప్రత్యేక చేనేత వస్త్రాలు, మగ్గాలు, చరిత్ర, మోడల్స్ ప్రదర్శనకు ఉంచనున్నట్టు ఆయన చెప్పారు.