International
రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్‌కు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు
హైదరాబాద్: వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల వ్యవస్థలో పెనుమార్పుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాహనాల స్థితిని ఖచ్చితంగా, పారదర్శకంగా పరీక్షించేందుకు 10 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS), హైదరాబాద్‌లో 7 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో కేంద్రాల నిర్మాణం ప్రారంభమైంది. ఒక్కో స్టేషన్ సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని, అధునాతన సాంకేతిక పరికరాలతో నిర్మించనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఈ స్టేషన్లలో వాహనాల బ్రేకులు, హెడ్‌లైట్లు, స్టీరింగ్, సస్పెన్షన్, ఎమిషన్ లెవల్స్ వంటి అంశాలను కంప్యూటరైజ్డ్ పరికరాలతో పూర్తిగా ఆటోమేటెడ్‌గా పరీక్షిస్తారు. మానవ హస్తక్షేపం లేకుండా జరిగే ఈ విధానం వల్ల అవినీతి అవకాశాలు తొలగిపోతాయని, పరీక్షలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జరిగి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ కానున్నదని వెల్లడించారు. ఫిట్‌నెస్ లేని వాహనాలను రోడ్లపై నడిపించకుండా నిరోధించడం ద్వారా రోడ్డు ప్రమాదాలపై కట్టడి, కాలుష్య నివారణ సాధ్యమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.