ఫోన్ ట్యాపింగ్‌పై బీఎర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు
తెలంగాణ రాజకీయాలలో మరో వివాదాస్పద ఆరోపణ దుమారం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులతో పాటు ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేయిస్తున్నారనే సంచలన ఆరోపణలు BRS పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేశారు. ప్రైవేట్ హ్యాకర్ల ద్వారా ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. “రాత్రి 2 గంటలకు సీఎం ఎవరి ఇంటికి వెళ్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. హీరోయిన్ల ఫోన్ కాల్స్‌ను కూడా ప్రైవేట్ హ్యాకర్లతో వినిపిస్తున్నారంటే.. ఇది ఎలాంటి పాలన?” అంటూ ఆయన మండిపడ్డారు.
ED విచారణకు డిమాండ్ చేసిన కౌశిక్ ఫోన్ ట్యాపింగ్ వంటి చట్టవిరుద్ధ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడి లాంటివని అభిప్రాయపడిన కౌశిక్ రెడ్డి, ఈ వ్యవహారంపై వెంటనే ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అధికార పక్షం ఇంకా స్పందించనప్పటికీ, బీఆర్ఎస్ వర్గాలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేయనున్నట్లు కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇప్పటికే పలు రాష్ట్రాలలో రాజకీయ దుమారాన్ని రేపిన వేళ, ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే దిశగా ఉద్రిక్తతలు చెలరేగే అవకాశముంది.