Latest Updates
మెట్రో ప్రాజెక్ట్‌కు చివరి గడువు ప్రకటన
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతాలకు మెట్రో సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ఫేజ్–2 ప్రాజెక్ట్ కోసం రూ.125 కోట్ల పరిపాలన నిధులను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ నిర్ణయానికి సంబంధించి ఉత్తర్వులపై సంతకం చేశారు.
ఈ మెట్రో విస్తరణ ప్రాజెక్ట్‌ను జాయింట్ వెంచర్ విధానంలో అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కార్యదర్శుల కమిటీ సభ్యులు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు హాజరయ్యారు. గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం మెట్రో బదిలీ ప్రక్రియను పూర్తిచేయాల్సిన అవసరం ఉందని సీఎస్ స్పష్టం చేశారు.
రాబోయే 100 రోజుల్లో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, అలాగే లావాదేవీలకు సంబంధించిన సలహాదారు అయిన ఐడీబీఐ బ్యాంక్ నివేదికను త్వరితగతిన ఖరారు చేయాలని సూచించారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీ ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కూడా తెలిపారు.
హైదరాబాద్ మెట్రోను కొనసాగించడం తమకు సాధ్యం కాదని ఎల్ అండ్ టీ ప్రకటించిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 25న ఎల్ అండ్ టీ అధికారికంగా ఫేజ్–1 నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సుమారు రూ.13,000 కోట్ల రుణ భారంను ప్రభుత్వం భరించడంతో పాటు, ఎల్ అండ్ టీ పెట్టిన రూ.2,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని ఒకేసారి చెల్లించేందుకు అంగీకరించింది.
ఫేజ్–2 పనులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందడాన్ని వేగవంతం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫేజ్–1ను ఫేజ్–2తో అనుసంధానించేందుకు ఎల్ అండ్ టీతో స్పష్టమైన ఒప్పందం ఉండాలని కేంద్రం స్పష్టం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్–2లో జాయింట్ వెంచర్ భాగస్వామిగా చేరాలని ఎల్ అండ్ టీని కోరింది. అయితే ఫేజ్–2A, 2Bలలో ఈక్విటీ భాగస్వామిగా ఉండలేమని, ఆ ఒప్పందంపై సంతకం చేయలేమని ఎల్ అండ్ టీ తేల్చి చెప్పింది. తమ ఈక్విటీ వాటాను రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో, ప్రభుత్వం మెట్రో టేకోవర్ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ పరిణామాలతో హైదరాబాద్ మెట్రో భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత రావడంతో పాటు, నగర రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
#HyderabadMetro#MetroPhase2#TelanganaGovernment#RevanthReddyGovt#OldCityMetro#UrbanTransport#HyderabadDevelopment
#MetroRailProject#LAndT#PublicTransport#InfrastructureNews#TelanganaUpdates
![]()
