Health
టెన్షన్ వల్లే గుండె జబ్బులు పెరుగుతున్నాయా?
ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి మధ్య వయసు వ్యక్తుల వరకు గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్అటాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ అంశంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బొల్లినేని బాస్కర్రావు మాట్లాడుతూ, “మన సమాజంలో ఒత్తిడి (స్ట్రెస్) స్థాయులు పెరగడం, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలు” అని తెలిపారు. గతంలో 50 ఏళ్లు దాటిన తర్వాతే గుండె సమస్యలు ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడు 30–40 ఏళ్లకే హార్ట్అటాక్స్ వస్తున్నాయన్నారు.
డాక్టర్ బాస్కర్రావు వివరిస్తూ, “పొగ త్రాగడం, మద్యం సేవించడం, అధిక కొవ్వు ఉన్న ఆహారం, ఫాస్ట్ఫుడ్ అలవాట్లు, నిద్రలేమి — ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా టెన్షన్ ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ లాంటి హార్మోన్లు ఎక్కువవుతాయి. ఇవి రక్తపోటును పెంచి గుండెకు ముప్పు తెస్తాయి. అలాగే డయాబెటిస్, ఊబకాయం, హైపర్టెన్షన్ కూడా హార్ట్అటాక్స్కు దారితీసే ప్రమాదకర అంశాలు” అన్నారు.
గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం, ఫాస్ట్ఫుడ్ తగ్గించడం, పొగాకు–మద్యం మానేయడం, ఒత్తిడి తగ్గించే యోగా–ధ్యానం చేయడం, తగినంత నిద్రపోవడం తప్పనిసరి అని చెప్పారు. “వార్షికంగా హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా గుండె సమస్యలను ముందుగానే గుర్తించి నియంత్రించవచ్చు” అని డాక్టర్ బాస్కర్రావు హెచ్చరించారు.