Education
“ఒక్కసారి సీటు వస్తే చాలు.. ఇంటర్ వరకు ఉచిత చదువు, వసతి, భోజనం”
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉచితంగా, ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నారు.
ప్రవేశాల కోసం జనవరి 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో కారేపల్లి, టేకులపల్లి మండలాల్లో ఉన్న ఈ ఆదర్శ పాఠశాలలకు ప్రతి ఏడాది భారీగా దరఖాస్తులు వస్తుండటంతో పోటీ ఎక్కువగా ఉంటోంది.
ఆరో తరగతిలో మొత్తం 100 సీట్లు ఉంటాయి. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లను ప్రవేశ పరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్లో ప్రవేశాలు కల్పిస్తారు. బాలిక విద్యార్థులకు వసతి సౌకర్యాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఈ పాఠశాలలు విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి విద్యను కూడా అందిస్తున్నాయి. తొమ్మిదో తరగతి నుండి విద్యార్థులు ఐటీ, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, హెల్త్‌కేర్, డేటా ఎంట్రీ, టూరిజం, కుట్టుపని, బ్యూటీషియన్ వంటి 26 రకాల వృత్తి విద్యా కోర్సులను ఎంచుకోవచ్చు. విద్యార్థులు తమకు నచ్చిన రెండు కోర్సులను ఎంచుకోవచ్చు. తదుపరి విద్యా సంవత్సరం నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్, యోగా, కరాటే శిక్షణలు కూడా అందించబడతాయి.
ప్రవేశానికి అర్హతగా, ప్రస్తుతం ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ విద్యార్థులు రూ.125 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ప్రవేశ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో 100 మార్కులకు నిర్వహించనున్నారు.
ఆరో తరగతి ప్రవేశానికి తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్లం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఏడో నుంచి పదో తరగతులకు గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఆంగ్లం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న టేకులపల్లి, కారేపల్లి మోడల్ స్కూళ్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. గ్రామీణ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
#ModelSchools#AdarshaSchools#FreeEducation#RuralEducation#GovernmentSchools#EnglishMediumEducation#StudentAdmissions
#EducationForAll#SkillDevelopment#VocationalCourses#GirlsEducation#ResidentialSchools#KhammamDistrict#TelanganaEducation
![]()
