Andhra Pradesh
భక్తుల కోసం కొత్త దారి: చంద్రబాబు సూచించిన 4 ప్రత్యామ్నాయ ప్రాంతాలు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవడం భక్తులకు జీవితకాల అదృష్టంగా భావిస్తారు. అలాంటి పవిత్ర అవకాశాన్ని మరింత మందికి అందుబాటులోకి తెచ్చే దిశగా, తిరుపతిని ఒక ప్రధాన వివాహ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా సూచించారు.
తిరుపతి కొండపై శ్రీవారి వద్ద పెళ్లి చేసుకునే అవకాశం అందరికీ దొరకడం లేదు. కాబట్టి, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, తొండవాడ, తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాల్లో పెళ్లిళ్లు జరుపుకుని తర్వాత శ్రీవారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని, తిరుపతి ప్రాంతాన్ని పెళ్లిళ్లకు ముఖ్యమైన ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు.
తిరుచానూరులో చాలా కల్యాణ మండపాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ రాగానే వీటిని ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. తిరుపతిలో కూడా చాలా కల్యాణ మండపాలు ఉన్నాయి. హోటళ్లలో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. శ్రీనివాసమంగాపురం, తొండవాడ ప్రాంతాల్లో కూడా వివాహ వేదికలు ఉన్నాయి. కానీ స్టార్ హోటళ్లలో పెళ్లి చేసుకోవడం ఖరీదైన విషయమవుతోంది. అక్కడ పెళ్లి చేసుకోవడానికి రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న కళ్యాణ వేదికలు సామాన్యులకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇక్కడ తక్కువ ఖర్చుతో, ఆర్భాటం లేకుండా వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. టీటీడీ పరిధిలో కల్యాణ వేదికతో పాటు 20కి పైగా మఠాలు, ఇతర మండపాలు, మరో 15 ప్రత్యేక వేదికలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 50కి పైగా వివాహాలు జరుగుతుండగా, పవిత్ర ముహూర్తాల సమయంలో ఈ సంఖ్య 150 వరకు చేరుతోంది.
తిరుపతి వివాహాలకు మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే తక్కువ రుసుముతో వివాహ వేదిక, వసతి, శ్రీవారి దర్శనం వంటి సదుపాయాలను అందించాలని అధికారులు భావిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం, రెండు రోజుల ప్రత్యేక వివాహ ప్యాకేజీ రూపకల్పనపై పర్యాటక శాఖ పనిచేస్తోంది. ఈ ప్యాకేజీలో వివాహ వేదిక, శ్రీవారి దర్శనం, వసతి వంటి సౌకర్యాలు ఉంటాయి.
వివాహాల ద్వారా క్యాటరింగ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియో, మంగళవాయిద్యాలు, మేకప్, రవాణా, వసతి వంటి అనుబంధ రంగాల్లో పది వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. ఈ సేవలన్నీ సర్టిఫైడ్ టూరిజం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. భక్తుల అభిరుచికి అనుగుణంగా టీటీడీ కళ్యాణ మండపాలు, దర్శన సౌకర్యాలు కల్పించే విధంగా విధివిధానాలు త్వరలో ఖరారు కానున్నాయి.
#TirupatiWedding#TirumalaWedding#WeddingDestination#TTDKalyanaVedika#TempleWedding#SpiritualWedding#AndhraPradeshTourism
#TirupatiNews#BudgetWedding#TraditionalWedding#DivineWedding#WeddingInIndia#ReligiousTourism#CulturalTourism
![]()
