Telangana
హైదరాబాద్ జవహర్‌నగర్‌లో రహస్య కెమెరా కలకలం – అద్దె ఇంటి యజమాని అరెస్ట్

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. జవహర్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో యజమాని అశోక్ యాదవ్ తన అద్దెదారుల బాత్‌రూం బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చిన విషయం బయటపడింది. ఈ దారుణాన్ని గుర్తించిన బాధిత దంపతులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యజమాని అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన అద్దె ఇళ్లలో నివసించే వారి భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ నిందితుడు ఎలక్ట్రిషియన్ చింటూ సహాయంతో కెమెరా ఏర్పాటు చేయించినట్టు తేలింది. చింటూ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన హాస్టళ్లు, హోటళ్లకు మాత్రమే పరిమితం కాకుండా అద్దె గృహాల్లో కూడా వ్యక్తిగత గోప్యత దెబ్బతింటోందని నిరూపించింది.
బాధిత మహిళ బాత్‌రూం బల్బ్ స్క్రూ విప్పి చూడగా హోల్డర్ లోపల సీక్రెట్ కెమెరా దొరకడంతో షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని యజమానికి తెలియజేసినా నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఇలాంటి సంఘటనల నుంచి రక్షించుకోవాలంటే అద్దె ఇళ్లలో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గదిలో లైట్లు ఆఫ్ చేసి మొబైల్ టార్చ్ లైట్‌తో మూల మూలా పరిశీలిస్తే కెమెరా ఫ్లాష్ బ్లింక్ అవుతుంది. ఇలా రహస్య కెమెరాలను సులభంగా గుర్తించవచ్చని పోలీసులు తెలిపారు.