Andhra Pradesh
శ్రీశైలం డ్యామ్ వద్ద సుందర దృశ్యం – భారీగా వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కులకు చేరగా, ఔట్‌ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయం గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వరద దృష్ట్యా శ్రీశైలం డ్యామ్ పరిసర ప్రాంతాల్లోకి పర్యాటకులు భారీగా చేరడంతో అక్కడి దృశ్యాలు దివ్యంగా కనిపిస్తున్నాయి. నీటి పరవళ్లు అద్భుతంగా అలరిస్తున్నాయి.
ప్రస్తుతం నాలుగు గేట్లను ఎత్తి సుమారు 1.08 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్రెగులేటర్ ద్వారా మరో 31 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం టర్బైన్ల ద్వారా 66 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వరద కారణంగా డ్యామ్ వద్ద రద్దీ పెరగడంతో అధికారులు అప్రమత్తమై ఎలాంటి అపాయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మట్టం 884 అడుగులకు చేరగా, పూర్తి స్థాయి నీటిమట్టానికి దగ్గరలోనే ఉంది. దీంతో జలాశయం నుండి దిగువకు ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఉదయం నాగార్జునసాగర్ గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
![]()
