Andhra Pradesh

వేసవిలోనూ నీటి కొరత లేదు.. విశాఖకు కొత్త రిజర్వాయర్ భరోసా

విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్‌లో ఉన్న 5, 6 వార్డుల ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. సాయిరాం కాలనీ కొండపై రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త తాగునీటి రిజర్వాయర్ పనులు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో శరవేగంగా సాగుతున్నాయి.

గతంలో ‘అమృత్ 2.0’ పథకం కింద ఈ రిజర్వాయర్ పనులు ప్రారంభించినప్పటికీ నిధుల కొరత కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. ఈ అంశాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ, వెంటనే నిధులను విడుదల చేసింది. దాంతో నిలిచిపోయిన పనులు తిరిగి ఊపందుకున్నాయి.

మార్చి నెలాఖరునాటికి రిజర్వాయర్ పని పూర్తవుతుంది. వేసవి రాగానే నీరు ఇవ్వడం మొదలుపెడతారు. ఈ రిజర్వాయర్ వల్ల 31 వేల మందికి తాగునీరు లభిస్తుంది.

సాయిరాం కాలనీ ఫేజ్-1, 2, 3, శ్రీనివాస్‌నగర్, ఎస్టీబీఎల్ థియేటర్ ప్రాంతం, డ్రైవర్స్ కాలనీ, జీసీసీ లేఅవుట్, వైభవ్‌నగర్, ప్రశాంతినగర్, కొమ్మాది గ్రామం, హౌసింగ్ బోర్డు కాలనీ, అమరావతి కాలనీ, సేవానగర్, దేవిమెట్ట, రిక్షాకాలనీ తదితర ప్రాంతాలకు ఈ రిజర్వాయర్ ద్వారా నీటి సరఫరా మెరుగుపడుతుంది.

ఇప్పటివరకు కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతూ, భారీ ఖర్చులు భరిస్తూ డ్రమ్ముల్లో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త రిజర్వాయర్‌తో ఆ ఇబ్బందులకు పూర్తిగా చెక్ పడనుంది.

స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పలుమార్లు ఉన్నతాధికారులకు వినతులు అందించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ కీలక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేసి అన్ని కాలనీలకు మంచినీరు అందిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

#Visakhapatnam#Madhurawada#GVMC#DrinkingWaterProject#WaterReservoir#PublicUtilities#AndhraPradeshDevelopment
#CoalitionGovernment#SaiRamColony#Amrut20#SummerWaterRelief#VizagNews#APInfrastructure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version