Connect with us

Telangana

పేదల అసైన్డ్ భూములపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలు మారబోతున్నాయి.

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలు మారబోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న గందరగోళం, అవస్థలకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభంగా, పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రజలకు వేగంగా, నాణ్యంగా సేవలు అందించాలన్నదే ఈ మార్పుల వెనుక ఉన్న ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలంలో ఎస్.ఎస్.ఆర్ బిల్డర్స్ నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో ఈ తరహా భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి ఆధునిక భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడదని మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేట్ బిల్డర్ల భాగస్వామ్యంతో భవనాలు నిర్మించడమే కాకుండా, వాటి నిర్వహణ బాధ్యతను కూడా ఐదేళ్ల పాటు ఆయా సంస్థలే చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గచ్చిబౌలిలోని ‘తాలిమ్’ భవనంలో నిర్మిస్తున్న కార్యాలయం ఈ ఏడాది జూన్ 2 నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుందని చెప్పారు.

భవనాల నిర్మాణంతోనే ప్రభుత్వం ఆగిపోవడం లేదని, భూముల వ్యవహారాల్లో మానవీయ దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. గతంలో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను అభివృద్ధి పనుల కోసం అవసరమైతే, వారికి తగిన పరిహారం ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించే వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కొత్తగా నిర్మిస్తున్న సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే తల్లులు, వృద్ధుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వెయిటింగ్ హాల్స్, మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలంటే ఉండే పాతకాలపు గందరగోళానికి ముగింపు పలికి, కార్పొరేట్ కార్యాలయాలను తలపించే ప్రశాంత వాతావరణం ఏర్పడనుందని మంత్రి తెలిపారు.

ఇదిలా ఉండగా, మేడారం మహాజాతరను ఈసారి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

#TelanganaDevelopment#IntegratedSubRegistrar#LandRegistrationReforms#PonguletiSrinivasReddy#TSRevenueDepartment
#PublicFriendlyGovernance#TransparentRegistration#DigitalTelangana#MedchalMalkajgiri#Kukatpally#TSGovernment#MaaBhoomiReforms

Loading