Education
పిల్లలకు ఐఐటీ ఫౌండేషన్ క్లాసులు.. సైకాలజిస్టు హెచ్చరిక

ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసులోనే ఐఐటీ ఫౌండేషన్ క్లాసుల్లో చేర్పిస్తున్నారు. భవిష్యత్తులో మంచి ర్యాంకులు, కెరీర్ కోసం ఇది అవసరమని భావిస్తూ చిన్నారులపై ఒత్తిడి పెడుతున్నారు. అయితే దీనిపై నిపుణులు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. చిన్నారుల మానసికాభివృద్ధికి ఇది ప్రతికూలమని చెబుతున్నారు.
ఈ విషయంలో సైకాలజిస్టు శ్రీకాంత్ స్పందిస్తూ.. “పిల్లల మెదడు, మనసు ఒక వయసు వచ్చేదాకా కొన్ని కాంప్లెక్స్ కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోలేవు. చిన్నారులపై ముందే ఇలాంటి ఒత్తిడి పెడితే వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది” అని అన్నారు. పిల్లల సైకాలజీని పరిశీలించిన జీన్ పియాజే సిద్ధాంతాలను ఉదాహరిస్తూ, వయస్సుకు తగ్గట్టే పాఠ్యాంశాలు రూపొందించబడ్డాయని గుర్తు చేశారు.
“ఐదో తరగతి చదువుతున్నప్పుడు పిల్లల్ని ఐఐటీ ఫౌండేషన్ క్లాసులకు నెట్టడం అర్థంలేని పని. తల్లిదండ్రులు అలా కాకుండా పిల్లల ఆసక్తి, మానసిక సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని మార్గనిర్దేశనం చేయాలి” అని శ్రీకాంత్ సూచించారు. చిన్న వయసులో ఒత్తిడి పెడితే భవిష్యత్తులో వారిలో విసుగు, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరించారు.
![]()
