Telangana
దక్షిణ మధ్య రైల్వే అదిరింది.. రేపు చర్లపల్లి నుంచి ‘అమృత్ భారత్’ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రారంభం
హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి వార్త చెప్పింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్రజలకు ఈ వార్త చాలా సంతోషం కలిగిస్తుంది. కొత్తగా అభివృద్ధి చేసిన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు కొత్త ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు సర్వీసును ప్రారంభిస్తారు. ఈ రైలు జనవరి 23న మొదటిసారిగా ప్రయాణిస్తుంది.
కొత్త రైలు చర్లపల్లి నుండి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గుండా వెళుతుంది. ఆపై తమిళనాడులోని కాట్పాడి, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు స్టేషన్లను కలుపుతూ కేరళలోని పాలక్కాడ్, ఎర్నాకుళం, కొట్టాయం, కొల్లం గుండా తిరువనంతపురం చేరుకుంటుంది. ఈ రైలు నియమిత వారపు షెడ్యూల్‌ను త్వరలో నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు.
సామాన్య ప్రయాణికులకు సైతం అత్యున్నత ప్రమాణాల ప్రయాణం అందించాలనే లక్ష్యంతో అమృత్ భారత్ రైలును రూపొందించారు. ఈ రైలులో మొత్తం 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 8 స్లీపర్ కోచ్‌లు ఉండగా.. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన 2 సెకండ్ క్లాస్ కోచ్‌లు, ఒక ప్యాంట్రీ కార్ అందుబాటులో ఉంటాయి. రెండు వైపులా ఇంజన్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణ వేగం పెరగడమే కాకుండా, కుదుపులు లేని సాఫీ ప్రయాణం సాధ్యమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్–విశాఖపట్నం మార్గంలో నడిచే రైళ్లకు అదనపు బోగీలను జత చేశారు. సికింద్రాబాద్–విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌కు మూడు అదనపు థర్డ్ ఏసీ బోగీలు జనవరి 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అలాగే సికింద్రాబాద్–అనకాపల్లి రైలుకు కూడా మూడు అదనపు ఏసీ బోగీలు జనవరి 22 నుంచే ప్రయాణికులకు సేవలందించనున్నాయి.
ఈ కొత్త రైలు సర్వీసులు, అదనపు బోగీలతో తెలుగు రాష్ట్రాల నుంచి కేరళ, ఉత్తర ఆంధ్ర ప్రాంతాలకు ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు రద్దీ సమస్యలు తగ్గనున్నాయి. చర్లపల్లి టెర్మినల్ ప్రాధాన్యత మరింత పెరగనుండటం విశేషం.
#AmritBharatExpress#CharlapalliTerminal#HyderabadRailway#SouthCentralRailway#KeralaTravel#RailwayNews#IndianRailways
#TeluguNews#TravelUpdate
![]()
