Andhra Pradesh
జగన్ చేతుల్లోనుంచి జారిపోతున్న కడప.. ఊహించని రాజకీయ ట్విస్ట్!
కడప జిల్లాలో రాజకీయ సన్నివేశం వేగంగా మారిపోతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఊహించని పరిణామాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ నుంచి వైదొలిగిన తరువాత రికార్డు మెజార్టీతో కడప ఎంపీగా నిలిచిన జగన్ అప్పటి నుంచి జిల్లాలో తన పట్టు గట్టిగానే కొనసాగించారు. అయితే 2024 ఎన్నికలు ఆ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలో కూడా వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలింది.
ఇప్పుడైతే కడపపై కూటమి నేతలు దృష్టి కేంద్రీకరించారు. ఈ నెల 11న కడపను కేంద్రంగా చేసుకుని కీలక నిర్ణయానికి రెడీ అవుతున్నారు. పులివెందులలో జగన్ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన కూటమి ఇప్పుడు నేరుగా కడప నగర పాలక వ్యవస్థలో చెక్‌మేట్ పెట్టాలని వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో కడప మేయర్ ఎన్నికకు అసాధారణ ప్రాధాన్యం ఏర్పడింది.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 11న కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కార్పొరేటర్లు మరియు ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరుకావాలని ఆదేశించారు. రెండు రోజుల క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో, జిల్లా స్థాయిలో ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది.
మేయర్ పదవి నుంచి సురేష్ బాబును అవినీతి ఆరోపణలతో తొలగించడం, అనంతరం డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను బాధ్యతలు అప్పగించడం ఇప్పటికే నగర రాజకీయాలను మారుస్తుంది. పాలకవర్గానికి ఇంకా ఐదు నెలల మాత్రమే గడువు ఉండటంతో, కీలక అభివృద్ధి పనులకు ఆమోదం అవసరమనే కారణంతో మేయర్ ఎన్నిక అత్యవసరమైందని భావిస్తున్నారు.
అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్‌పై సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 9న విచారణ జరగనుంది. ఇంతకుముందు కోర్టు ఇచ్చిన ఉపశమనంతో ఆయనకు మళ్లీ వాదన అవకాశం లభించిన విషయం తెలిసిందే.
ఒకవైపు వైఎస్సార్‌సీపీ కోర్టు తీర్పును ఆసక్తిగా ఎదురు చూస్తుండగా… మరోవైపు కూటమి నేతలు తమ రాజకీయ ప్లాన్లను అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో కడప కేంద్రంగా జరగబోతున్న మేయర్ ఎన్నిక, జిల్లాలోని భవిష్యత్ రాజకీయాలకు కీలక మలుపుగా మారింది. మొత్తం మీద కడప రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
#KadapaPolitics #YSJagan #APPolitics #KadapaMayorElection #Pulivendula #YSRCP #TDPJSPAlliance #APNews #PoliticalUpdates #AndhraPradesh #KadapaNews #BreakingNews #TeluguNews
![]()
