Andhra Pradesh

ఏపీ విద్యార్థులకు శుభవార్త: స్కూల్ కిట్ల కోసం భారీ నిధుల విడుదల

AP Govt Rs 830 Crores Student Kits: విద్యార్థులకు భారీ మద్దతు – ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’కు నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల సంక్షేమంపై కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించేందుకు ప్రభుత్వం రూ. 830.04 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ సామగ్రిని ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పథకం కింద పంపిణీ చేయనున్నారు.

ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుకు అవసరమైన అన్ని మౌలిక వస్తువులను ఒకే కిట్‌లో అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ కిట్లలో నోట్‌బుక్‌లు, టెక్స్ట్ బుక్స్, వర్క్‌బుక్స్, డిక్షనరీలు, బ్యాగ్, బెల్ట్, షూలు, మూడు జతల యూనిఫాం క్లాత్‌లు ఉంటాయి. విద్యార్థుల చదువు భారం తగ్గించి, సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

నిధుల విభజనను పరిశీలిస్తే, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 157.20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 672.84 కోట్లుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని కిట్ల సేకరణ, తయారీ, నిల్వ మరియు పంపిణీ కోసం వినియోగించనున్నారు. నాణ్యమైన వస్తువులు విద్యార్థులకు అందేలా టెండర్ల ద్వారా సరఫరాదారుల ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్ ప్రక్రియ నుంచి చివరి దశ పంపిణీ వరకు మొత్తం వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హత కలిగిన సంస్థల నుంచే సామగ్రి కొనుగోలు చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే ఈ కిట్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన టైం లైన్ను కూడా ఖరారు చేసింది. ఈ నెలలోనే పరిపాలన, ఆర్థిక, సాంకేతిక అనుమతులతో పాటు ఉన్నతస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని నిర్ణయించింది. డిసెంబరు మొదటి వారంలో టెండర్ డాక్యుమెంట్ల సిద్ధం, రెండో వారంలో టెండర్ ప్రకటన, జనవరి చివరి వారంలో టెండర్ల ఖరారు చేయాలని పేర్కొంది.

అదేవిధంగా ఫిబ్రవరి రెండో వారంలో మూడు దశల్లో నమూనాల నాణ్యత పరిశీలన, మే నెలలో జిల్లా–మండల స్టాక్ పాయింట్లకు సరఫరా, జూన్ మొదటి వారంలో పాఠశాలలకు పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 12న విద్యార్థులకు కిట్లను అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది పెద్ద భరోసాగా నిలవనుంది.

#APGovt#StudentMitra#SarvepalliRadhakrishnan#APEducation#SchoolStudents#StudentKits#EducationSupport#APSchools
#GovtSchools#EducationNews#TeluguNews#APBudget#StudentWelfare

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version