Andhra Pradesh
ఉచితంగా రూ.9999? బ్యాంక్ మోసపు ట్విస్ట్ మీకు తెలియనిదే..!
సైబర్ నేరగాళ్లు మరోసారి కొత్త మోసానికి తెరతీశారు. బ్యాంకుల పేరుతో వచ్చే రివార్డ్ పాయింట్ల మెసేజ్‌లు ప్రజలను తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో పంపుతున్న అనుమానాస్పద మెసేజ్‌లు, APK ఫైళ్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మీ ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్‌లో రూ.9,999 విలువైన రివార్డ్ పాయింట్లు మీకు ఉన్నాయని, అవి గడువు ముగియబోతున్నాయని చెబుతారు. ఈ మెసేజ్‌తో పాటు BOI Mobile.apk అనే ఫైల్ కూడా పంపుతారు.
ఈ మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చినట్లు అనిపించవచ్చు. కానీ మీరు పొరపాటున ఈ లింక్ లేదా ఫైల్‌పై క్లిక్ చేస్తే, మీ ఫోన్ పూర్తిగా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ APK ఫైల్‌ను తెరిచిన వెంటనే, మీ ఫోన్‌లోని అన్ని డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తుంది. మీ ఫోన్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా, మీ ఫోన్ నంబర్ ‘BOI’గా మారుతుంది. ఆ ఫోన్‌లో సేవ్ చేసిన అన్ని కాంటాక్ట్‌లకు అదే APK ఫైల్, సందేశం ఆటోమేటిక్‌గా వెళ్తుంది.
మరింత ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. హ్యాక్ అయిన నంబర్ ఏదైనా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే, ఆ గ్రూప్‌లోని అందరికీ కూడా ఈ మోసపు మెసేజ్ చేరుతుంది. గ్రూప్ పేరు మారిపోవడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ తరహా మోసాలు జరిగాయి. ఇప్పుడు అదే విధానంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో మోసాలు జరుగుతున్నాయి. బ్యాంకులు లేదా బీమా సంస్థలు ఎప్పుడూ వాట్సాప్ ద్వారా రివార్డ్ పాయింట్ల కోసం APK ఫైల్‌లను పంపరు.
ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు
తెలియని లింకులు క్లిక్ చేయకూడదు
APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదు
అనుమానం వస్తే నేరుగా బ్యాంకును సంప్రదించాలి
ఒకవేళ పొరపాటున ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే
బ్యాంక్ అకౌంట్‌లను ఫ్రీజ్ చేయించాలి
ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి
UPI, ఈ-మెయిల్ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలి
సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలి లేదా దగ్గరలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
#CyberFraud#BankScamAlert#BOIScam#CyberCrime#OnlineFraud#APKScam#DigitalSafety#BankingFraud#CyberAlert
#StaySafeOnline#ScamWarning#IndiaCyberCrime#1930Helpline
![]()
