Andhra Pradesh
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టైన వంశీకి అస్వస్థత – గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
గుంటూరు:
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆరోగ్యం మరింత దిగజారడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
మొన్న రాత్రి వంశీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తొలుత ఆయనను విజయవాడ సమీపంలోని కంకిపాడు హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం అవసరమని వైద్యుల సూచనతో ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి షిఫ్ట్ చేశారు.
వంశీకి శ్వాసకోస సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి నివేదికను వైద్యులు త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇక నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి సంబంధించి దాఖలైన బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. వంశీ అనారోగ్య పరిణామాల నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఏ విధంగా ఉండనుందన్న ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలపై అక్రమాల కేసులు నమోదు కావడం, విచారణలు ముమ్మరంగా సాగడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వంశీ ఆరోగ్య పరిస్థితి, కేసు తీర్పు – రెండూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.