Telangana

చేపల లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా.. ఎగబడిన జనం..

రోడ్డంతా చేపలే.. అవి కూడా సాదాసీదా చేపలు కాదండోయ్.. ఖరీదైన కొర్రమీను చేపలు. అందులోనూ లైవ్ ఫిష్. అమ్మటానికి ఎవ్వరూ లేరు.. కొనేవాడూ ఎవరూ లేరు.. దొరికొనోడికి దొరికినన్ని సంచిలో వేసుకుని వెళ్లిపోవటమే.. పులుసో ఫ్రై చేసుకుని కడుపునింపుకోవటమే. అదేంటీ.. అక్కడేమైనా చేపల వర్షం కురిసిందా.. లేదా ఏదైనా స్పెషల్ ఆఫర్ పెట్టారా అని బుర్రలు బద్దలుకొట్టుకోకండి. అసలు విషయమేమిటంటే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న చేపల లోడు వ్యాన్.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ వద్ద ప్రమాదానికి గురైంది.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని తప్పించబోయిన వ్యాన్‌.. అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా వ్యాన్ పడిపోవటంతో.. అందులో ఉన్న చేపలన్ని ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాయి. ఇంకేముంది.. రోడ్డుపై పెద్ద మొత్తంలో చేపలను చూసిన జనాలు ఊరుకుంటారా.. వాటిని పట్టుకునేందుకు ఎగబడిపోయారు. పెద్ద పెద్ద సంచులు పట్టుకుని ఘటనా స్థలంలో వాలిపోయారు. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని అన్నట్టుగా.. రోడ్డుపైనే చేపల వేట కొనసాగించారు. రోడ్డుపై గిలగిల కొట్టుకుంటున్న చేపలను కష్టపడి పట్టుకుని సంచుల్లో నింపుకుని.. అక్కడి నుంచి ఉడాయించారు.

అక్కడ ఓ యాక్సిడెంట్ జరిగిందని ఏమాత్రం ఆలోచించకుండా.. అక్కడున్న చేపలను మాత్రం దొరికినోళ్లకు దొరికినన్ని పట్టుకుని వెళ్లిపోవటం గమనార్హం. అయితే.. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలికి చేరుకునే సమయానికి.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఉప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version