News

బల్దియాకు అప్పుల విముక్తి: రూ. 4,780 కోట్ల రుణాలను టేకోవర్ చేయనున్న రేవంత్ సర్కార్!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని మూడు కొత్త కార్పొరేషన్లుగా విభజించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు అప్పుల విషయంలోనూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ తీసుకున్న రూ. 4,780 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది.

 జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో, పాత అప్పులను కొత్త వాటికి పంచితే అవి ఆర్థికంగా కుప్పకూలే ప్రమాదం ఉందని టాస్క్‌ఫోర్స్ కమిటీ హెచ్చరించింది,గత రెండేళ్లుగా జీహెచ్‌ఎంసీ తన రుణాలపై ప్రతి నెలా సుమారు రూ. 100 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తోంది. ఈ భారం వల్ల కొత్త అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడుతోంది. 2014 తర్వాత హైదరాబాద్ వేగంగా విస్తరించింది. ఎస్సార్‌డీపీ (SRDP) కింద నిర్మించిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, నాలాల అభివృద్ధి కోసం దాదాపు రూ. 7,000 కోట్ల వరకు రుణాలు సేకరించారు. అందులో మిగిలిన ప్రధాన వాటాను ఇప్పుడు ప్రభుత్వం భరించనుంది.

ప్రభుత్వమే ఈ అప్పులను స్వీకరించడం వల్ల కొత్తగా ఏర్పడే మూడు కార్పొరేషన్లు ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా తమ పరిధిలోని పౌర సదుపాయాలపై దృష్టి సారించవచ్చు. ఇప్పటికే దీనిపై అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. త్వరలోనే అధికారికంగా ఈ రుణాల బదిలీ ప్రక్రియ జరగనుంది. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం భాగ్యనగర ముఖచిత్రాన్ని మార్చే కీలక అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version