Telangana

కవిత బహిరంగ క్షమాపణ: అమరవీరుల కుటుంబాలకు పూర్తి న్యాయం చేయలేకపోయానని ఆవేదన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో వారి ఆశయాలను పూర్తిగా నెరవేర్చలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 500 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలిగామని, మిగతా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని అంగీకరించారు. ఇకపై వారికి పూర్తి న్యాయం జరిగేలా తాను కృషి చేస్తానని తెలిపారు.

‘జాగృతి జనం బాట’ పేరుతో 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో పర్యటన చేపట్టనున్నట్లు కవిత వెల్లడించారు. నాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన 1200 మంది అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గత పాలనలో అమరవీరుల కుటుంబాలకు తగిన గౌరవం ఇవ్వలేకపోయామన్న బాధ వ్యక్తం చేశారు.

తాను ఎంపీగా, పార్టీ వేదికల్లో అనేక సార్లు అమరవీరుల కుటుంబాల విషయాన్ని ప్రస్తావించినప్పటికీ, న్యాయం సాధించలేకపోయానని కవిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేయకపోతే, వచ్చే ప్రభుత్వంతో తప్పక అమలు చేయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తిరిగి ఉంచేవరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు.

సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా జాగృతి జనం బాట పర్యటన ప్రారంభించిన కవిత, అన్ని వర్గాల సమానాభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అగ్రవర్ణాల్లో కూడా రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. పాత విభేదాలను పక్కనపెట్టి, జాగృతి కార్యకర్తలందరూ మళ్లీ కలసి పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version