Andhra Pradesh
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం.. సజీవదహనమైన ప్రయాణికుడి వద్ద నగదు–బంగారం లభ్యం

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. రెండు ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి, దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా గుర్తించారు. ఘటన అనంతరం మృతుడి దగ్గర ఉన్న బ్యాగును పరీక్షించగా, అదొక కలకలం మిగిల్చింది. బ్యాగులో రూ.5.80 లక్షల నగదు మరియు కొంత బంగారం ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అయితే, మంటల్లో ఎక్కువ మొత్తంలో నోట్ల కట్టలు కాలిపోయాయని తెలిపారు.
ఆదివారం రాత్రి 1.30 గంటల సమయంలో బీ1, ఎం2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎం1 బోగీని కూడా రైలుతో వేరు చేశారు. కాలిపోయిన బోగీల స్థానంలో మూడు కొత్త ఏసీ కోచ్‌లను జత చేసి రైలును గమ్యస్థానానికి పంపించారు. సామర్లకోట స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ అగ్నిప్రమాదం కారణంగా విశాఖపట్నం-విజయవాడ మార్గంలో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొంతమంది రైళ్లకు షెడ్యూల్ ప్రకారం నడిపించారు, మరికొన్ని రైళ్లకు మార్గమార్పులు చేశారు. ప్రయాణికులకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు కల్పించారు. రైళ్ల రాకపోకలపై నిరంతర సమాచారాన్ని అందిస్తున్నారు. సాయంత్రం నాటికి రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మరియు అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ తీవ్ర దిగ్భ్రాంతి వెల్లడించారు. ఆయన ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా మరియు మిగిలిన ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలయనని ఆయన సూచించారు.
ఈ ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణ చేపట్టింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను నిర్ధారించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగడం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
#Yelamanchili#ErnakulamExpress#TrainFireAccident#Anakapalli#RailwayAccident#TrainFire#PassengerSafety#IndianRailways
#APNews#RailwayUpdates#BreakingNews#TrainTravel#RailwayInvestigation