Andhra Pradesh
ఈ నెల 21న డీఈఓ కార్యాలయాల ముట్టడికి టీచర్ల పిలుపు: ఏపీలో విద్యా సంస్కరణలపై ఉపాధ్యాయుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న విద్యా సంస్కరణలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఈ సంస్కరణలు విద్యారంగాన్ని బలహీనపరుస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోపిస్తూ, ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లోని జిల్లా విద్యాశాఖ (డీఈఓ) కార్యాలయాలను ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో ఏపీ యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF), స్టేట్ టీచర్స్ యూనియన్ (STU), ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (APTF), వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ (YSRTA), పీఆర్టీయూ వంటి సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో పాల్గొననున్నాయి.
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా, వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా సంస్కరణలను అమలు చేస్తోందని సంఘాల నాయకులు విమర్శించారు. ముఖ్యంగా, గత ప్రభుత్వం జీఓ 117 ద్వారా చేపట్టిన పాఠశాలల విలీనం, 3 నుంచి 5 తరగతులను హైస్కూళ్లకు మ్యాప్ చేయడం, టీచర్ల రీ-అప్పార్షన్మెంట్ వంటి నిర్ణయాలు విద్యారంగానికి హాని కలిగించాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జీఓ 19, 20, 21 ద్వారా తీసుకుంటున్న చర్యలు మరింత గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని తమ డిమాండ్లను పరిశీలించేలా ఒత్తిడి తీసుకురావాలని ఉపాధ్యాయ సంఘాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి