Andhra Pradesh

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట: శ్రీకాకుళం జిల్లా విషాదంలో మునిగింది – 10మంది భక్తులు మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి తరలివచ్చారు. అయితే భారీగా గుమికూడిన భక్తుల కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుని 10మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఏకాదశి కావడంతో ఆలయంలో భారీ రద్దీ ఏర్పడటమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు చెబుతున్నారు.

స్థానికుల సమాచారం ప్రకారం, ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూలైన్‌ల రెయిలింగ్ ఒక్కసారిగా కూలిపోవడంతో భక్తులు కిందపడిపోయి తొక్కిసలాట జరిగింది. ఎక్కువమంది మహిళా భక్తులు ఉండటంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ ఆలయం సుమారు 12 ఎకరాల్లో నిర్మించబడింది. భక్తుల రద్దీని అంచనా వేయకపోవడంతో, సరైన నియంత్రణ లేకపోవడం కూడా ప్రమాదానికి దారితీసిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే దేవాదాయశాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడు ఘటనపై సమాచారం సేకరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సంఘటన స్థలానికి వెళ్లి సీపీఆర్ చేయడం ద్వారా తన సహాయాన్ని అందించారు. ఈ సమయంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

కాశీబుగ్గ ఆలయాన్ని ఒడిశా రాజకుటుంబానికి చెందిన హరిముకుంద పండా అనే వ్యక్తి నిర్మించారు. 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో ఈ దేవస్థానం 2023 ఆగస్టులో ప్రారంభమైంది. ఆ తరువాత భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలి వస్తున్నారు. అయితే ఈరోజు ఏకాదశి, అదీ శనివారం కావడంతో రద్దీ ఎక్కువై దుర్ఘటన జరిగింది. దాదాపు 25 వేల భక్తులు చేరడంతో ఆలయ సామర్థ్యాన్ని మించి రద్దీ పెరిగిందని అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version