Connect with us

Telangana

ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు..

ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు..

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫార్మాసిటీ కూడా ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకోగా..పర్యావరణ హితంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా.. ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి చెందిన ఐదు ఫార్మా దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీల ప్రతినిధులు చర్చలు జరిపారు.

హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. మరికొని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూలైన్‌లో వేచి ఉన్నాయి. తాజాగా.. హైదరాబాద్ గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. డాక్టర్ రెడ్డీస్, హెటిరో, ఎంఎస్‌ఎన్‌, అరబిందో, లారస్ కంపెనీలు గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. మొదటి దశలో ప్రతి కంపెనీ 50 ఎకరాల స్థలంలో తమ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. ఈ విషయమై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును సెక్రటేరియట్‌లో ఆయా ఫార్మా కంపెనీల ప్రతినిధులు కలుసుకున్నారు.

ఈ కంపెనీలు ఫార్మా సిటీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండగా, వారి నిర్ణయంపై మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని మంత్రి చెప్పారు. ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏర్పాట్లు చేస్తామని హమీ ఇచ్చారు. సీఎం రేవంత్ ఆలోచనల ప్రకారం ఫ్యూచర్ సిటీ ఏర్పడుతుందని, అందులో గ్రీన్ ఫార్మా సిటీ కూడా భాగంగా ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, ఈ 5 ఫార్మా కంపెనీల్లో ప్రస్తుతం దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. మరికొందరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు గ్రీన్ ఫార్మా సిటీకి త్రాగునీరు, విద్యుత్ సరఫరా పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.

ఇక రాష్ట్రంలో రహదారులపై అభివృద్ధిపై కూడా రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. కొత్త రహదారులు నిర్మించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న రహదారులను విస్తరిస్తున్నారు. వరంగల్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక గ్రీన్ ఫార్మాసిటీలో భాగంగా కొంగర కలాన్‌ నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు (RRR) వరకు 300 అడుగుల వెడల్పుతో ప్రపంచ స్థాయి రహదారి నిర్మించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రోడ్డుకు సమాంతరంగా మెట్రో రైలు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే ఇండస్ట్రీయల్ పవర్ పాలసీని ప్రకటిస్తామని చెప్పారు.

Advertisement

Loading

Trending